మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల
posted on Aug 20, 2025 4:59PM

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు పాటు ఈ జాతర జరగనుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం రూ.150 కోట్ల మంజూరు చేయడం, గిరిజనులపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరను అత్యంత కన్నుల పండుగగా జరుపుకుంటారు. సమ్మక్క సారక్కను దర్శనం చేసుకునేందుకు కోట్లాది సంఖ్యలో భక్తులు మేడారంకి వెళతారు.