ఉచితానికి ప్రలోభ పడి.. ఎంగిలిప్లేట్లు కడిగి..!

పిలవని పేరంటానికి వెళ్లిన పెద్ద ముత్తయిదువ అగ్రతాంబూలం ఇవ్వాల్సిందేనని గొడవ పెట్టుకుందట.. అయితే వాయినం మాట అటుంచి ఆమెను ‘మర్యాద’గా బయటకు సాగనంపారు. సరిగ్గా అలాంటి మర్యాదే ఓ ఎంబీఏ విద్యార్థికి ఎదురైంది. పేరంటానికి వెళ్లినందుకు కాదు. ఆహ్వానం లేకండా పెళ్లి విందుకు హాజరై సుబ్బరంగా తిన్నందుకు.

ప్రస్తతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ విందు భోజన అనంతర మర్యాదకు సంబంధించిన సంఘటన జబల్పూర్ లో జరిగింది. సాధారణంగా ఫంక్షన్ హాళ్లలో జరిగే వివాహ వేడుకలు, రిసెప్షన్లకు ఆహ్వానితులు మాత్రమే హాజరౌతారన్న గ్యారంటీ ఏమీ లేదు. కొందరు పనీ పాటా లేకుండా ఏదో కాలక్షేపం చేసి అల్పాహారం, విందు భోజనం లాగించేద్దాం అనే ఉద్దేశంతో వచ్చే వాళ్లూ ఉంటారు. ముఖ్యంగా  వేరే ఊళ్ల నుంచి చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చిన వారు.. హాస్టళ్లలో, హోటళ్లలో ఫుడ్ తిని తిని విసిగిపోయి..ఇదుగో ఇలా ఎక్కడైనా వివాహ విందు జరుగుతుంటే ఆహ్వానం లేకపోయినా వెళ్లి విందారగించి, వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేస్తుంటారు.

అంతా బాగా జరిగి.. ఎవరూ గుర్తించి అడ్డగించకపోతే ఓకే.. కానీ పెళ్లివారిలో ఎవరికైనా అనుమానం వచ్చి నిలదీసి నిగ్గ దీస్తే మాత్రం కష్టాలే. సరిగ్గా అలాంటి కష్టాలే జబల్పూర్ లో ఓ ఎంబీయే విద్యార్థికి అనుభవంలోకి వచ్చాయి. జబల్పూర్ లో ఓ వివాహ విందుకు ఈ జబల్పూర్ విద్యార్థి ఆహ్వానం లేకపోయినా మాంచి వివాహ భోజనంబు ఆరగించేద్దామని వెళ్లాడు. హాయిగా విందు భోజనం భుజించాడు. ఇక బయటకు వచ్చేద్దామనుకుంటుండగా పెళ్లి వారికి అనుమానం వచ్చింది. అడ్డగించి నిలదీశారు.

వాస్తవం తెలుసుకుని మంచి భోజనం చేశారుగా అందుకు తగ్గ పని కూడా చేయడం అంటే మర్యాద చేశారు. ఆ ఎంబీయే విద్యార్థి చేత ఎంగిలి ప్లేట్లు కడిగించారు. అతగాడా పని చేస్తుండగా వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ వీడియోయే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దొరికిపోయి జబల్పూర్ పరువు తీశావు సోదరా అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా నేను చాలా సార్లు చేశాను, కానీ ఎప్పుడూ దోరకలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

కొసమెరుపేమిటంటే... దొరికి పోయి ఎంగిలి ప్లేట్లు కడిగిన ఎంబీయే విద్యార్ధి కూడా ఆ వీడియోపై తన కామెంట్ పెట్టాడు. ఉచితంగా ఏదైనా పొందాలనుకోవడం దురాసే కదా.. అందుకే శిక్ష అనుభవించాను అన్నది అతగాడి కామెంట్.  ఉచిత ప్రలోభాలకు లొంగి ఓట్లు గుద్దేసే ప్రజలకు కూడా ఉచితాలకు ఆశపడితే శిక్ష తప్పదన్న జ్ణానోదయం ఎప్పుడౌతుందో కదా.