ముందస్తు ముచ్చట్లు ఎవరి ‘గోల్’వారిదే.. ఎవరి గోల వారిదే!

ముందస్తు ఎన్నికలు డైలీ సీరియల్ లో మరో ఎపిసోడ్ మన ముందుకొచ్చింది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు, మీడియా కథనాలు ఎలా ఉన్నా, అధికార తెరాసలోనూ అదే గందరగోళం, ఒక విధమైన ఊగిసలాట కనిపిస్తోంది. ఎదుకో తెలియదు కానీ తెరాస నాయకులే ముందస్తు ముచ్చట్లు డైలీ సీరియల్ లా సాగదీస్తున్నారు. ఒకరు ఇటు, ఒకరు అటు నిలపడి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. అది కూడా  ఏదో చిన్నాచితక నాయకులు, హాఫ్ టికెట్ గాళ్లు అసలే కాదు.  అలాంటి వారు  ఏదో అన్నారంటే అర్థం చేసుకోవచ్చును. కానీ, పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా, పూటకో మాట, నోటికో మాట అన్నట్లుగా మాట్లాడడంతో రాజకీయ వర్గాల్లో అదే చర్చ జరుగుతోంది.

నిజానికి, ముందస్తు ఎన్నికలు వచ్చినా, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరిగినా  ప్రజలకు ప్రత్యేకించి జరిగే మేళ్ళు  పెద్దగా ఉండవు.  అయినా, ఇప్పడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా  అదే చర్చ. ముందస్తు ఎన్నికలు వస్తాయా? రావా? వస్తే ఎందుకు వస్తాయి, రావంటే ఎందుకు రావు ఇదే చర్చ జరుగుతోంది. 
అయితే  రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు మాత్రం రాజకీయ వేడి చల్లారకుండా, ముందస్తు ముచ్చట్లు వదులుతున్నారని అంటున్నారు. ఇతర సమస్యల నుంచి మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, విచారణలలో వెలుగు చూస్తున్న ఇబ్బందికర పరిస్తితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అధికార పార్టీ ముఖ్య నాయకులు  ముందస్తు ముచ్చట్లు వినిపిస్తున్నారని పరిశీలకులు విశ్లేస్తిస్తున్నారు. 

కొద్ది రోజుల క్రితం తెరాస కీలక నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, బోయినపల్లి వినోద్ కుమార , సమయం లేదు మిత్రమా... ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు, ఆరేడు నెలల్లోనే నగారా మోగుతుంది, ‘గెట్ రెడీ  అంటూ  క్యాడర్ ను  హెచ్చరించారు. అందుకు ఒక రోజు అటూ ఇటుగా, రాష్ట్ర ఆర్థిక మంత్రి, తెరాస కీలక నేత, ముఖ్యంగా ఎన్నికల వ్యూహ రచనలో మామకు మించిన అల్లుడిగా చెప్పుకునే  మంత్రి హరీష్ రావు, ముందస్తు లేదు వెనకస్తు లేదు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలని తేల్చి చెప్పారు. మరో వంక మీడియా చర్చల్లో పాల్గొనే, తెరాస నాయకులు,ఎమ్మెల్యేలు అటూ ఇటూ కాకుండా, అవునని కాదని రెండు మాటలూ ఒకరే చెపుతున్నారు.

అదలా ఉంటే ఇప్పడు తాజాగా  ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ టూ పొజిషన్’లో ఉన్న ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుట్ల తారక రామా రావు, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని ప్రకటించారు. నిజానికి, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. అలాగే ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో ప్రధాన సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని కేటీఆర్ ప్రజలకు మాటిచ్చారు.  

అయితే ఫలితాలు వచ్చి 15 రోజులు  కాదు ఇంచు మించుగా నెల రోజులు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మునుగోడులో కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగ లేదు సరికదా ఎన్నికల ప్రకటనకు ముందు హడావిడిగా మొదలు పెట్టిన పనులు కూడా  ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నిజానికి, ఎన్నికలకు ముందు అడుక్కో ఎమ్మెల్యే, గజానికో మంత్రి అన్నట్లుగ మునుగోడును చుట్టేసిన తెరాస నాయకులు  ఎవరూ ఈ నెలరోజుల్లో అటుకేసి కన్నెత్తి అయినా చూడలేదు. చివరకు గెలిచిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా కనిపిచడం లేదని ప్రజలు అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే మంత్రి కేటీఆర్ మరో నలుగురు మంత్రులు  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని మునుగోడు వెళ్లి అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గతంలో హుజూర్ నగర్, నాగార్జున సాగర్, ఇప్పడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ ఒకేసారి ఆరేడు నెలల్లో పూర్తి చేస్తామని  అలాగే, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పనులు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో రాబోయే 10, 12 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని,  ఆలోపే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అంటే, పనులు ప్రాజెక్టుల విషయం ఎలా ఉన్నా ముందస్తుకు వెళ్ళేది లేదని, కేటీఆర్ చెప్పకనే చెప్పారు. అయితే ఇంతటితో ముందస్తు ముచ్చట్లు ఆగుతాయా  అంటే అబ్బే అదేం లేదు. అదదే ఇదిదే... అంతే.. ఎవరి గోల వారిదే ..ఎవరి ‘గోల్’వారిదే.