కరి లక్ష్మికి కార్డియాక్ అరెస్టు! కడసారి చూపుకోసం పోటెత్తిన భక్త జనం

లక్ష్మి కార్డియాక్ అరెస్టుతో మరణించింది. 27 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించిన లక్ష్మిని కడసారి చూసేందుకు భక్త జన సందోహం తరలి వచ్చింది. తమిళనాడులోని  మనాకుల వినాయకర్ ఆలయంలో లక్ష్మి దశాబ్దాల సేవలతో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రురాలైంది. అందరి అభిమానాన్నీ చూరగొంది. అలాంటి లక్ష్మి మార్నింగ్ వాక్ చేస్తూ ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది.

వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మరణించిందని తేల్చారు. ఈ వార్త తెలియగానే భక్త జనసందోహం ఆలయానికి వచ్చింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారంతా లక్ష్మి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు.

ఇంతకీ లక్ష్మి ఎవరు, ఆమె మరణిస్తే భక్తులు కంటతడి పెట్టడమేమిటి అనుకుంటున్నారు. లక్ష్మి ఒక ఏనుగు. గత రెండున్నర దశాబ్దాలుగా వినాయకర్  ఆలయంలో సేవలందిస్తోంది. భక్తులందరికీ ఏనుగు లక్ష్మి ఒక కుటుంబ సభ్యురాలిగా దగ్గరైపోయింది. దాని హుందాతనం, దాని కలివిడి తనం, పిల్లలు పెద్దలూ అన్న తేడా లేకుండా దగ్గరకు వచ్చిన వారందరినీ తొండంతో దీవెనలు అందచేసే మంచితనంతో ఆలాలగోపాలాన్నీ ఆకట్టుకుంది.

దీంతో లక్ష్మి మరణ వార్త భక్తులను కలచి వేసింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారిలో భక్తులూ కాదు.. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.