మత్తయ్య కాల్ డాటాతో దేశ భద్రత ముడిపడుందా!
posted on Jul 3, 2015 4:03PM
.gif)
ఓటుకి నోటు కేసులో నాల్గవ నిందితుడిగా ఉన్న మత్తయ్య కాల్ రికార్డ్స్ డాటా సమర్పించామని విజయవాడ 3వ మెట్రోపోలిటన్ కోర్టు కోరినప్పుడు అది దేశభద్రతకు భంగం కలిగించే అంశమని కనుక కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొన్నాకనే కోర్టుకి ఆ వివరాలు అందించగలమని చెప్పినట్లు సమాచారం. కానీ రేవంత్ రెడ్డిపై ఎసిబి అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేసిన మరుక్షణంలోనే ఎసిబి చేతిలో మాత్రమే ఉండవలసిన ఆడియో వీడియో టేపులు మొట్ట మొదట టీ-న్యూస్ ఛానల్లో ఆ తరువాత సాక్షితో సహా అన్ని ఛానల్స్ లో ప్రసారం అయిపోయాయి. అందుకు ఎసిబి ఏమి సమాధానం చెపుతుందో మున్ముందు విచారణలో తేలవలసి ఉంది. అదే విధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులందరి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి దానికి టెలీఫోన్ సంస్థలు ఏమి సమాధానం చెపుతాయో చూడాల్సి ఉంది.
అత్యంత రహస్యంగా ఉంచాల్సిన వివరాలను మీడియాకి బహిరగతం చేసినప్పుడు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు గానీ దేశ భధ్రతకు ఎటువంటి భంగం కలగనప్పుడు, ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్స్ డాటాని కేవలం కోర్టుకి అందజేస్తే ఏవిధంగా దేశ భద్రతకు భంగం కలుగుతుందని టెలీఫోన్ కంపెనీలు భావిస్తున్నాయో తెలియదు. కానీ కోర్టు అడిగినా ఇవ్వలేమని కేంద్రం అనుమతి లేనిదే తెగేసిచెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ మొబైల్ సంస్థల మాటలు విన్న ప్రజలు మాత్రం మత్తయ్యకి వచ్చే ఫోన్ కాల్స్ తో దేశ భద్రత ముడిపడి ఉంటే అతను చాలా గొప్పవాడయ్యే ఉండాలి...అని అనుకోవలసి వస్తోంది.