ఖర్చుకు వెనుకాడుతున్న మాగుంట?
posted on Mar 26, 2012 11:59AM
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పిందే వేదం. అక్కడ ఆయన సిఫార్సుతో కాంగ్రెస్ టిక్కెట్లు పొంది, శాసన సభ్యులుగా ఎన్నికై మంత్రులైన వారు కూడా ఉన్నారు. త్వరలో ఒంగోలు శాసన సభా స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను కూడా పార్టీ నాయకత్వం మాగుంట శ్రీనివాస రెడ్డికే అప్పగించింది. కాని గతంలో వలె ఆయన ఈ సారి అభ్యర్థి ఎంపికపై ఉత్సాహం చూపడం లేదు. ఎందుకంటే తాను ఏ అభ్యర్థి పేరును సూచిస్తే అతన్ని గెలిపించుకునే బాధ్యతను కూడా ఆయనే భుజాన వేసుకోవాల్సి వస్తుంది. ఎన్నికల వ్యయాన్ని మొత్తం భరించాల్సి ఉంటుంది. దీంతో ఈ తలనొప్పి తనకెందుకనుకుంటున్నారు మాగుంట శ్రీనివాస రెడ్డి. అభ్యర్థి ఎంపిక విషయాన్ని చర్చించేందుకు హైదరాబాద్ రావాల్సిందిగా పార్టీ నాయకత్వం, పదేపదే పిలుస్తున్నప్పటికి మాగుంట శ్రీనివాస రెడ్డి స్పందించడం లేదని తెలుస్తోంది. దీనికి తోడు దర్శి నియోజక వర్గంలో తన మాటకు పార్టీ అధినేతలు ప్రాధాన్యత నివ్వడం లేదన్న ఆగ్రహాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇది కారణం కాదని, అనవసరంగా డబ్బు తగలేసుకోవడం ఎందుకనే ఉద్దేశ్యంతోనే ఆయన ఒంగోలు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ముందుకురావడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.