మదనపల్లి ఫైల్స్ దగ్థం కేసులో నెక్ట్ టార్గెట్ ఎవరు?
posted on Apr 27, 2025 12:19PM

గత ప్రభుత్వం హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండాలని కుట్ర పన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందనేది సీఐడీ ఆరోపణ. ఇది నిజం అనేలా పలు రకాల ఆధారాలు సైతం సేకరించింది. ఇందులో పాత్ర ఉందని అనుమానాలు ఉన్న వారికి సంబంధించిన సీడీఆర్ ఫైల్స్ ను సంపాదించిన సిట్ యాక్షన్ లోకి దిగింది. తొలుత సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అయినా , అర్థరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగి గౌతమ్ తేజ్ ను అరెస్టు చేశారు. అక్కడే పని చేస్తున్న మాజీ ఆర్డీవో, ఆర్డీవో ఇతర అధికారుల పై సైతం చర్యలు తీసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా కేసు కు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంతో , ఇంత పెద్ద కేసు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని చర్చనడిచింది.
ఈ కేసులో కీలకంగా మారిన ఏ2 మాధవ రెడ్డిని రీజనల్ సీఐడీ పోలీసులు రెండు రోజులు క్రితం హడావుడిగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన తరువాత పక్కా ప్లాన్ తో మాధవ రెడ్డి అజ్ణాతంలోకి వెళ్లిపోయాడు. ఎవరికి అందుబాటులోకి రాకుండా తిరుగుతున్నాడు. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం పెద్దగొట్టిగల్లు సమీపంలోని తన ఫామ్ హౌస్ లో ఉంటూ కల్యాణ మండపం నిర్వహిస్తున్నారు. దీన్ని గుర్తించిన సిట్ డీఎస్పీ కొండయ్య నాయుడు పక్కా ప్లాన్ చేశారు. కల్యాణ మండపం కావాలంటూ వెళ్లి పట్టుకున్నారు. రొంపుచర్ల నుంచి అరెస్టు చేసి తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించి విచారణ అనంతరం చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు సరైన పత్రాలు లేవని బెయిల్ మంజూరు చేసింది.
తుకారాం కోసం వేట
కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని, ఆయన చేసిన అక్రమాలు బయట పడుతాయని ఫైల్స్ దగ్థం చేసి అగ్ని ప్రమాదం గా సృష్టించారనే దాని పై కేసు నమోదు చేశారు. ఇందులో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు గా ఉన్న మాధవరెడ్డి ఒక్కరు కాగా ఘటన జరిగిన తరువాత నుంచి విదేశాలకు వెళ్లిపోయిన తుకారాం కీలకం అని అనుమానిస్తున్నారు. ఈ కేసులో నెక్ట్ టార్గెట్ అయిన తుకారాం ను విదేశాల నుంచి రప్పించేందుకు సీఐడీ పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరలో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.