పోరాటాల గడ్డ ఓరుగల్లుకు కదిలిన గులాబీ దండు..కేసీఆర్ స్పీచ్‌పైనే సర్వత్రా ఉత్కంఠ

 

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరువాడా సిద్ధమైంది. పోరాటాల గడ్డ ఓరుగల్లుకు తెలంగాణ రాష్ట్ర నుంచి నలుదిక్కులా ప్రజలు తమ ఇంటి పండుగలా భావించి వెల్లువలా కదిలివస్తున్నారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో గులాబీ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అలాగే పార్టీ ఏర్పాటైన జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై గౌరవం, ఇంటిపార్టీపై అభిమానంతో రైతులు, సాధారణ ప్రజలు ఎందరో ఎల్కతుర్తిలో జరగనున్న సభకు ముందుగానే బయలుదేరారు. సూర్యాపేటకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఎండ్లబండ్లపై ఎల్కతుర్తికి వెళ్తున్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఎందరో పార్టీ అభిమానులు సై కిల్‌ యాత్రగా వెళ్లారు. సిరిసిల్ల, గజ్వేల్‌, బాల్కొండ, నిర్మల్‌ తదితర నియోజవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక కంట్రోల్‌ కమాండ్‌ సెంటర్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే 9014206465 నంబర్‌కు ఫోన్‌ చేయాలని పార్టీ బాధ్యులు సూచించారు. వేసవి ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో సభకు వచ్చేవారి కోసం 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. గులాబీ బాస్ స్పీచ్ వినడానికి పార్కింగ్‌ ప్రాంతాలతో పాటు 23 చోట్ల భారీ ఎల్‌ఈడీ తెరలను అమర్చారు. మహిళలు, దివ్యాంగులు, ముఖ్య నేతలకు ప్రత్యేక గ్యాలరీలను సమకూర్చారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సభా వేదిక పక్కన ప్రత్యేకంగా మరో వేదికను నిర్మించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎడ్లబండ్లు, ప్రభలు, సైకిళ్లు, కార్ల ర్యాలీలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. సూర్యాపేట నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ఐదు రోజుల కిందట బయలుదేరింది. సైకిల్‌ ర్యాలీని శనివారం ప్రారంభించారు. పరకాల, నర్సంపేట నియోజకవర్గాల నుంచి ప్రభలతో నాయకులు తరలివస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గులాబీ రంగు కార్లతో కూట్‌కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ర్యాలీ రానుంది. 

బీఆర్‌ఎస్ సభకు సుమారు 50 వేల వెహికల్స్ వస్తాయని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే సుమారు 3 లక్షల మంది వరకు జనసమీకరణ చేస్తుండగా.. ప్రతి నియోజకవర్గానికి 25 వేలకు తక్కువ కాకుండా జనాల్ని తరలించే ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ అందరికీ కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. వరంగల్‌ నగరం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమైంది. చాల కాలం తర్వాత గులాబీ దళపతి బహిరంగసభలో ప్రసంగించనుండడంతో సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. సాయంత్రం 5.30 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారని, సుమారు గంటన్నర పాటు ప్రసంగించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గలు చెబుతున్నాయి