మళ్లీ కాంగ్రెస్ కు డ్యామేజీ.. ఈ సారీ కోమటిరెడ్డే కారణం!
posted on Mar 23, 2023 4:32PM
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువగిరి ఎంపీ కొంటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీ మారుతున్నారా? మారే ఆలోచన చేస్తున్నారా? అన్న చర్చ ఫుల్ స్టాప్, కామా అన్నది లేకుండా సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. సాగుతోంది అనడం కంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డే స్వయంగా ఈ చర్చను సాగదీస్తున్నారనీ, అందుకోసం ఆయన విరామం లేకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారనీ పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఆయన ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఉన్నా లేనట్లే.. పోనీ లేరనుకున్నా ఉన్నారాయె.
పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూసిన నాటి నుంచి, కోమటి రెడ్డిలో అసమ్మతి జ్వాల అలా రగులుతూనే ఉంది. సందర్భం ఉన్నా లేకపోయినా కోమటిరెడ్డి తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడానికి లేని అవకాశాలు కూడా సృష్టించుకుంటున్నారు. ఆయన ఇంతగా పార్టీ లైన్ ను భిన్నంగా, పార్టీ ప్రతిష్ట మసకబారే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా, పార్టీ మార్పు సంకేతాలు ఇస్తున్నా కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. పార్టీ ఇచ్చిన క్రమశిక్షణా రాహిత్యం నోటీసులు చెత్త బుట్టలో పారేశానని స్వయంగా ప్రకటించినా కూడా కోమటిరెడ్డిపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సాహసించడం లేదు. ఆయన దారి ఆయనదే.. పట్టించుకోకుండా ముందుకు సాగండి అన్న సంకేతాలే పీసీసీకి ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతర పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలవక తప్పదంటూ ఆయన చేసిన కామెంట్లు రాష్ట్రంలో బలంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగించాయి. అన్నిటికీ మించి ఆయన ‘చేయి’ వదిలేసి కమల దళంలో చేరేందుకు మార్గం సుగమం చేసుకునే పనిలో భాగంగానే హంగ్ వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలూ వినవచ్చాయి. అలాగే.. ఒక వేళ తన అంచనా నిజమై హంగ్ అసెంబ్లీ ఏర్పడి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపితే కోమటి రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారు. అలా కాకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అప్పుడు ఆయన కాంగ్రెస్ లో కొనసాగడమా, బీజేపీ తీర్ధం పుచ్చుకోవడమా అనే విషయంలో ఓక నిర్ణయం తీసుకుంటారనీ, అప్పటి వరకూ కాంగ్రెస్ కు ఆయన కంట్లో నలుసుగా, చెప్పులో రాయిలా అడుగడుగునా వెనక్కు లాగేలా వ్యవహరిస్తూనే ఉంటారని కాంగ్రెస్ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.
అసలు కాంగ్రెస్ హై కమాండ్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటోందన్న విశ్వసం లేశమాత్రంగా ఉన్నా ఈ సరికే కోమటి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఆయనపై చర్య తీసుకుని ఉండేది. బహిష్కరణ వేటు కాకపోయినా కనీసం సస్పెండ్ అయినా చేసి ఉండేది. అలా చేయడం లేదంటే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం లేకపోవడం వల్లనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం (మార్చి 23) ప్రధాని మోడీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు.
దాదాపు 20 నిముషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఆ తరువాత ఆయన మీడియాతో షరామామూలుగా తాను మోడీని కలవడానికి రాజకీయాలు కారణం కాదనీ, తన నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికేనని చెప్పారు. తాను పార్టీ మారే ప్రశక్తే లేదని పునరుద్ఘాటించారు. అయితే ఆయన మాటలను కాంగ్రెస్ వర్గాలే నమ్మడం లేదను కోండి అది వేరేసంగతి. మొత్తం మీద కోమటిరెడ్డి తీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్టను మసకబార్చి ఆ మేరకు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.