పెద్దల సభలో పెద్ద డ్రామా బిల్లు గోవిందా

న్యూఢిల్లీ: మంగళవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కిన లోక్‌పాల్ బిల్లు గురువారం రాజ్యసభలో 'భయం భయం'గానే అడుగుపెట్టింది. పెద్దల సభలో దీనిని గట్టెక్కించేందుకు యూపీఏకు తగిన బలం లేకపోవడంతో కాంగ్రెస్‌లో హైటెన్షన్ నెలకొంది. మిత్రపక్షమైన తృణమూల్ కూడా బిల్లును వ్యతిరేకిస్తుండటంతో టెన్షన్ మరింత పెరిగింది. పైగా... వివిధ పక్షాలు ఏకంగా 187 సవరణలు ప్రతిపాదించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. బయటి నుంచి మద్దతిచ్చే బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీలు సహకరిస్తే మినహాసబిల్లు గట్టెక్కే అవకాశమే లేదు. దీంతో బల సమీకరణ కోసం కాంగ్రెస్ భారీ కసరత్తు చేసింది. దీనిపై ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులు కానప్పటికీ మంత్రులు కపిల్ సిబల్, పవన్ కుమార్ బన్సల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.కోర్ కమిటీ భేటీ తర్వాత ప్రణబ్, బన్సల్, కపిల్ సిబల్ ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలతో సమావేశమయ్యారు. కానీ ఆ నేతలు తమ వైఖరి మార్చుకోలేదు. తృణమూల్ నేతలూ దిగి రాలేదు. బిల్లు విషయంలో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రభుత్వానికి మాత్రం మిత్రపక్షాలు సహకరించలేదు. ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి పరాభావం తప్పదని ఖాయంగా తేలిపోయింది. దీంతో ఓటింగ్ దాకా రాకుండానే గందరగోళానికి తెర తీసి, బిల్లును పక్కన పెట్టేశారు.

'లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు -2011'ను మంత్రి నారాయణస్వామి గురువారం ఉదయం ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సభలో లేకపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రధాని వచ్చేస్తున్నారు. ఆయన దారిలో ఉన్నారు' అని అధ్యక్షుడు హమీద్ అన్సారీ ప్రకటించినా వినిపించుకోలేదు. దీంతో సభను పది నిమిషాలు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రధాని వచ్చిన తర్వాతే విపక్ష నేత అరుణ్ జైట్లీ బిల్లుపై చర్చ ప్రారంభించారు. ఆయన వాదనలను కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తిప్పికొట్టారు. రాత్రి 11.30 గంటల సమయానికిగానీ వీరికి రాజ్యాంగ నిబంధనలు గుర్తుకు రాలేదు. అప్పుడు... అర్ధరాత్రి 12 గంటల తర్వాత చర్చ కొనసాగించడంపై హైడ్రామా మొదలైంది. మంత్రి నారాయణస్వామి మాట్లాడుతుండగా పరిస్థితి అదుపు తప్పుతున్న సంకేతాలు కనిపించాయి. అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సభను హమీద్ అన్సారీ వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu