రాజకీయాల్లో మహిళలకు ఎన్టీఆర్ ప్రోత్సాహం : అయ్యన్న పాత్రుడు

 

మహిళలు లేకుండా వికసిత్‌ భారత్‌ సాధించలేమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. చాల చోట్ల మహిళలు స్కూళ్లకు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో రెండో రోజు ఆయన మాట్లాడారు. ప్రతి స్త్రీకి భద్రత, ఆత్మ నిర్భరత అందించాలి. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఎకనామిక్‌ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. 

మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తే.. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి, ఆర్థికంగా స్వతంత్రులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కమిటీలు ప్రణాళికలు రూపొందించాలి. దేశంలోని ఆఖరి మహిళకు కూడా ఫలితాలు అందేలా ప్రణాళికలు ఉండాలి. పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి లోక్ సభ వరకు ప్రతి ఒక్కరూ మహిళల వృద్ధి కోసం కృషి చేయాలని సభాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసన కమిటీల మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు  రావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యా రంగంలోను, సమాజ సేవలోను భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేసిన  పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కమిటీల సభ్యులకు నమస్కారాలు తెలిపారు. రెండు రోజులపాటు విన్న ప్రసంగాలు, జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని, ఈ మంచి చర్చలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని  అయ్యన్న పాత్రుడు  పేర్కొన్నారు.


నందమూరి తారకరామారావు  అప్పట్లోనే మహిళలకు పెద్దపీట వేశారని, పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని  స్పీకర్  గుర్తుచేశారు.  రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 1983లో తాను తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు లేరని, మహిళా పంచాయతీ అధ్యక్షులు లేరని అయ్యన్న పాత్రుడు  పేర్కొన్నారు. కానీ నందమూరి తారకరామారావు  స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, అదే విధంగా అన్ని రాష్ట్రాల్లోను జరగాలని అన్నారు.

అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 22 మంది మహిళా శాసనసభ్యులు ఉన్నారని, శాసన మండలిలో కూడా మహిళా సభ్యులు ఉన్నారని  అయ్యన్న  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, లోక్‌సభ స్పీకర్  ఓం బిర్లా  రాజ్యసభ ఉప సభాపతి  హరివంశ్, ఏపీ ఉప సభాపతి  రఘురామ కృష్ణమరాజు పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి దేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీల అధ్యక్షులు, సభ్యులు,పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu