పశ్చిమ' కాంగ్రెస్ తీరుపై బొత్సా అసంతృప్తి
posted on Mar 26, 2012 4:36PM
పశ్చిమగోదావరిజిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీరు తెన్నులపై పిసిసి అధ్యక్షులు బొత్సా సత్యనారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ఈ జిల్లాలోని పార్టీ కెడర్ లో దాదాపు 70 శాతం ఆ పార్టీలో చేరిపోయింది. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున చేరుతుండటంతో ఆ పార్టీ భవిష్యత్తు అయోమయంలో పడింది. డిసిసి అధ్యక్షుడుగా ఉన్న గోకరాజు రామం పార్టీని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నారని బొత్సా అంటున్నారు. గోకరాజు రామం నోట్లో నాలుకలేని వ్యక్తి అని, పార్టీని కట్టడి చేసే సత్తా ఆయనలో లేదని జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే అంటున్నారు.
అయితే ఈ జిల్లాలో కనుమూరి బాపిరాజువంటి నాయకులు పార్టీని అడ్డుపెట్టుకుని పదవులు అనుభవిస్తున్నారే తప్ప పార్టీ అభివృద్ధికి కృషి చేయడంలేదన్న అపవాదులని కూడా ఎదుర్కొంటున్నారు. కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం నుంచి ఉన్నారు. ఆయనెంతసేపూ తన పదవి గురించి ఆలోచించుకుంటారు తప్ప పార్టీ గురించి ఆలోచించరని కార్యకర్తలు అంటున్నారు. పార్లమెంట్ సభ్యుడుగా ఆయన జిల్లా అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదని ఇప్పుడు టిటిడి చైర్మన్ కావడంతో ఆయన పూర్తి సమయాన్ని తిరుపతిలోనే గడిపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసిసి అధ్యక్షుడు గోకరాజు రామం కనుమూరి బాపిరాజుకు అత్యంత సన్నిహిత బంధువు కూడా అవుతారు. పార్టీ పగ్గాలు ఒకరిచేతిలోనూ, పదవులు మరొకరి చేతిలోనూ ఉన్నప్పటికీ ఈ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఏమీ చేయడంలేదన్న విమర్శలు రావడంతో బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగినట్లు తెలిసింది.