జగన్ కు కేవీపీ ఘాటు లేఖ... పోలవరంపై ప్రధానికి సంచలన నివేదిక...
posted on Mar 9, 2020 5:12PM

కాంగ్రెస్ ఎంపీ కేవీపీ... ఫస్ట్ టైమ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాజ్యాంగపరంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు అందాల్సిన నిధులు రావడం లేదన్న కేవీపీ... ఏపీ పునర్విభజన చట్టం అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన కేవీపీ... నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే తిరిగి అప్పగించాలని కోరారు. కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను తీసుకున్నారని ఆరోపించిన కేవీపీ... మీరు ఆ తప్పు చేయవద్దంటూ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం... వివిధ రూపాల్లో కేంద్రం నుంచి 27వేల 571కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, వాటిని సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు కేవీపీ.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తిరిగి కేంద్రానికే అప్పగించాలంటూ సీఎం జగన్ కు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ లేఖ రాస్తే, మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ.... ప్రధాని మోడీకి సంచలన నివేదిక సమర్పించింది. 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టు కేంద్రంగా బీజేపీ, వైసీపీ రాజకీయాలు చేశాయి. ప్రాజెక్టు అంచనాలు పెంచేసి చంద్రబాబు దోచుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే.... టీడీపీ నేతలకు పోలవరం ఏటీఎంలా మారిందంటూ ప్రధాని మోడీ విమర్శలు చేశారు. చంద్రబాబు టార్గెట్ గా ఆనాడు మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డిలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమంటూ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. తీరా చూస్తే ఆ ఆరోపణల్లో నిజం లేదని ఏకంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చింది.
పోలవరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో కాంట్రాక్టరును మార్చడం వెనుక భారీ అవినీతి జరిగిందంటూ కంప్లైంట్స్ రావడంతో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ప్రధాని కార్యాలయం ఆదేశించింది. దాంతో, పోలవరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ... కాంట్రాక్టు నిబంధనల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని పీఎంవోకి నివేదిక ఇచ్చింది. కాంట్రాక్టు కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయని, ముందున్న కాంట్రాక్టర్ సరిగా పనులు చేయకపోవడంతో, 60C రూల్ ప్రకారమే కాంట్రాక్టు సంస్థను మార్చినట్లు తన నివేదికలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక, ప్రాజెక్టు అంచనాలు పెరగడానికి 2013 భూసేకరణ చట్టమేనని తేల్చింది. అంతేకాదు, కొత్త ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పినట్లు కేంద్ర జలశక్తిశాఖ తెలియజేసింది. దాంతో, పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని, మిగతా ఆరోపణల్లో కూడా చివరికి తేలేది ఇదేనని తెలుగుదేశం నేతలు అంటున్నారు.