కులభూషణ్ శవాన్ని పంపుతాం.. తీసుకోండి..
posted on May 10, 2017 12:03PM

గూఢచర్య ఆరోపణలపై కులభూషణ్ జాదవ్ ను పాక్ బంధించి అతనికి మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయనను ఉరి తీస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన విషయం కూడా తెలసింది. అయితే దీనిపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్) వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఫోటో సంచలనం రేపుతోంది. ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన కొందరు దుండగులు... "కులభూషణ్ తిరిగి రావాలనుకుంటున్నారా? అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారా? అతని శవాన్ని పంపుతాం. తీసుకోండి" అంటూ పోస్టులు పెట్టారు. ఇక దీనిపై స్పందించిన ఏఐఎఫ్‌ఎఫ్.. తమ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైందని..హ్యాకింగ్‌కు గురైన తర్వాత ఇంటర్నెట్ నుంచి ఏఐఎఫ్‌ఎఫ్ వెబ్‌సైట్ అదృశ్యమైందని... వెబ్‌సైట్‌ను త్వరలో పునరుద్ధరిస్తామని, అసౌకర్యానికి క్షమించాలని కోరారు.
మరోవైపు భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం...ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ స్టే విధించింది. పదవీ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.