ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
posted on Dec 29, 2025 12:12PM
.webp)
ప్రస్తుత రేవంత్ సర్కార్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందనీ, ఈ పద్థతి నెహ్రూ హయాం నుంచీ ఉన్నదేననీ అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో నిఘా వ్యవస్థ లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్నారు.
దీనిపై అధికారులు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టడం లేదని నిలదీశారు. ప్రస్తుత డీజీపీ కూడా ఒకప్పుడు అధికారేనన్న కేటీఆర్ ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్ని తెలుసన్నారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న విషయం అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరన్న ఆయన అలాగే నిబంధనల మేరకు, వారికి సమాచారం ఏలా వస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కూడా అడగరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, సిట్ దర్యాప్తు వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.