కసబ్‌తో పోల్చుకున్న కేటీఆర్

తాను చాలా మంచోణ్ణని ప్రూవ్ చేసుకోవడానికి మాజీ రాజకుమారుడు కేటీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వకపోగా, ఆయన అహంకార పూరిత లూజ్ టాక్ కారణంగా ఆయన ఇమేజ్‌ మరింత డ్యామేజ్ అవుతూ, కెరర్ మొత్తం గ్యారేజ్‌కి పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈమధ్య ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఛానల్లో ఆయన మాట్లాడిన మాటల్లోంచి తవ్వేకొద్దీ అనేక ఆణిముత్యాలు దొరుకుతున్నాయి. మీమీద ఫోన్ ట్యాపింగ్ కేసులు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తున్నాయి కదా.. ఇప్పుడెలా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ చాలా గొప్పగా సమాధానం చెప్పాననుకుని చాలా చెత్తగా సమాధానం చెప్పారు. ‘‘కేసులు ఏం చేస్తాయి.. ఇప్పుడు కసబ్‌ని చూడండి.. ఎంతోమందిని షూట్ చేసి చంపేశాడు. సాక్ష్యాధారాలు వున్నా పదేళ్ళు మన చట్టాలు ఏమీ చేయలేకపోయాయి. పదేళ్ళపాడు కసబ్‌ని జైల్లో పెట్టి బిర్యానీతో మేపాం’’ అంటూ, ఎంత నేరం చేసినా భారత న్యాయ వ్యవస్థగానీ, చట్టాలు గానీ ఏమీ చేయలేవన్నట్టు మాట్లాడారు. అంటే, కసబ్‌ని చూసిన ధైర్యంతోనే, ఏ తప్పు చేసినా అంత ఈజీగా తేలదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ కుటుంబం నేరాలు చేసిందా? మేం నేరాలు చేసినా ఏం కాదు.. అవి తేలినప్పుడు సంగతి.. కసబ్ లాంటి నేరస్థుడికే ఏమీ కాలేదు.. మాకేం అవుతుందన్నట్టుగా కేటీఆర్ మాటతీరు వుంది.