మీ కిది..నాకది.. జగన్ కేసీఆర్ ల ఓప్పందంతోనే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్విడ ప్రోకోను తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుగణంగా అమోఘంగా వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఇది క్విడ్ ప్రొకోతో అక్రమాస్తులను కూడబెట్టారని జగన్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులు కూడా క్విడ్ ప్రొకో ఆధారంగా సంపాదించారన్న ఆస్తులపైనే. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన ఇదే ఫార్ములాతో నెట్టుకొస్తున్నారనడానికి తాజా ఉదాహరణ ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడమేనని అంటున్నారు. ఇందు కోసం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీరలా నేనిలా అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే ఏపీ నుంచి తెలంగాణ వ్యక్తి అయిన ఆర్.కృష్ణయ్యను జగన్ వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. అందుకు ప్రతిగా కేసీఆర్ హెటిరో అధినేత పార్థసారథి రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపిక చేశారంటున్నారు. 
హెటిరో పార్థసారథి రెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డికి స్వయానా వియ్యంకుడు. హెటిరో పార్థ సారథి రెడ్డిని ఏపీ నుంచి వైసీసీ అభ్యర్థిగా రాజ్యసభకు పంపే అవకాశం జగన్ కు లేకపోవడం వల్లనే కేసీఆర్ తో అవగాహన కు వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఉన్న నాలుగు స్థానాలలో రెండు స్థానాలను విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డిలకు ఖరారు చేసిన జగన్ మూడో స్థానాన్ని కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టే అవకాశాలు లేవు. అందుకే బీసీ కార్డును ఉపయోగించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్.కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. నిజానికి ఆర్.కృష్ణయ్యను కేసీఆర్ సిఫారసు మేరకే ఎంపిక చేశారని  ప్రచారంలో ఉంది. అందుకు ప్రతిగా కేసీఆర్ హెటిరో పార్థసారథి రెడ్డిని టీఆర్ఎస్ రాజ్యసభ క్యాండిడేట్ గా ఎంపిక చేశారు.  స్పష్టమైన రాజకీయ అవగాహనతోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారని అంటున్నారు.