కాంగ్రెస్ గూటికి తెలంగాణ ఉద్యమకారుడు నల్లాల ఓదెలు.. హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ?

తెలంగాణ ఉద్యమ కారుడు, చెన్నూరులో టీఆర్ఎస్ కీలక నేతలలో ఒకరైన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఆయన తన మద్దతుదారులతో హస్తిన వెళ్లారనీ, కాంగ్రెస్ పెద్దల సమక్షంగా ఆ పార్టీ కండువా కప్పుకుంటారనీ ఆయన వర్గీయులు చెబుతున్నారు. టీఆర్ఎస్ అధినాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్న ఓదెలు గత కొన్ని రోజులుగా పార్టీ మారే విషయమై తన సన్నిహితులు, అభిమానులతో చర్చించినట్లు చెబుతున్నారు.  

ఆ చర్చల ఫలితమే కాంగ్రెస్ గూటికి చేరాలన్న నిర్ణయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతతో కలిసి ఆయన తన మద్దతుదారులతో హస్తిన చేరుకున్నారంటున్నారు. నేడో రేపో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు చెబుతున్నారు. నల్లాల ఓదెలు టీఆర్ఎస్ ను వీడితే చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు గట్టి దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో గట్టి మద్దతుదారులు ఉన్నారు.

చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలం నల్లాల ఓదెలు అనడంలో సందేహం లేదు. ఆయన పార్టీ మారితే చెన్నూరు నియోజకవర్గంలో  టీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యమ నేతగా ఓదేలుకు నియోజకవర్గ ప్రజలలో అభిమానం మెండుగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఓదెలు నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఉద్యమంలో ఇబ్బందులు పడిన వారిని ఆదుకున్న చరిత్ర కూడా ఓదేలుకు నియోజకవర్గ ప్రజలలో మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అటువంటి ఓదేలు గత కొన్నేళ్లుగా టీఆర్ఎస్ నాయకత్వం ఉద్యమ కారుల పట్ల చిన్న చూపు చూస్తోందన్న అసంతృప్తితో ఉన్నారు.

టీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్న ఆయనను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంప్రదించిందని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్ కూడా త్యాగాలు చేసిందని, ఉద్యమ కారులకు తగు గుర్తింపు కాంగ్రెస్ వల్లే సాధ్యమౌతుందని రాష్ట్ర నాయకత్వం ఆయనను సమాధానపరిచినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన వర్గీయులు, అభిమానులు, సన్నిహితులతో విస్తృతంగా చర్చించిన నల్లాల ఓదెలు చివరకు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.  

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆయనను తోడ్కొని హస్తిన చేరినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్ర నాయకుల సమక్షంలో నేడో రేపో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం ఆయన సేవలకు,  సీనియారిటీకి తగిన గుర్తింపు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందనీ, అలాగే ఉద్యమ కారులకు  తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి పార్టీలో పెద్ద పీట వేయడం పట్ల కూడా ఓదెలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.