శ్రీకృష్ణ లెసెన్స్

 

రాముడు మంచి బాలుడు అంటారు. కాని, కృష్ణుడు మంచి బాలుడు అనరు! ఎందుకని? ఎందుకంటే, కృష్ణుడు మంచి బాలుడు కాదు గొప్ప బాలుడు! అంతే కాదు, కన్నయ్య గొప్ప కొడుకు, ప్రియుడు, స్నేహితుడు, తమ్ముడు, శిష్యుడు, గురువు, అన్నీ! అందుకే, మనకు నేర్చుకునే ఓపిక వుండాలేగాని నేర్పటానికి శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపంతో ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాడు! ఇంతకీ, ఆ జగద్గురువు మనకు నేర్పేదేంటి... 

 

1.  గోవిందుడు అందరి వాడేలే... అవును, గోవిందుడు ఇటు జన్మనిచ్చిన దేవకీ, వసుదేవులకి, అటు పెంచి, పోషించిన యశోదా, నందులకి అందరికీ ప్రీతిపాత్రుడే! కొడుకంటే ఎలా వుండాలో, ఎంతగా తల్లిదండ్రుల్ని సేవించి, ప్రేమించాలో ఆ దేవకీ తనయుడు, యశోదా నందనుడు మనకు అద్భుతంగా నేర్పిస్తాడు!

 

2. ధర్మ సంస్థాపనార్థాయ... శ్రీకృష్ణుడంటే ధ్వజమెత్తిన ధర్మమే! ధర్మ రక్షణే ఆయన ధ్యేయం! అవతార లక్ష్యం! అందుకే, ధర్మం వైపున నిలిచిన పాండవుల వైపే ఆయన నిలిచాడు! వాళ్లు అడవులపాలైనా , ద్రౌపతి అవమానం పాలైనా వెంట వుండి రక్షించాడు! చివరకు, విజయాన్ని ప్రసాదించాడు...

 

3. దేశభక్తి కలిగిన దేవదేవుడు... ద్వారకాధిపతి అయిన శ్రీకృష్ణుని కంటే దేశభక్తి మరొకరికి ఎవరికీ వుండదు! ద్వారకలోని తన ప్రజల్ని ఎంతో మంది రాక్షసులు పదే పదే బాధిస్తుంటే... ఏకంగా సముద్రం మధ్యలో వారి కోసం దేదీప్యమానమైన ద్వారక కట్టించాడు! అందులో తన రాజ్యంలోని జనాన్ని అందర్నీ క్షేమంగా వుంచాడు! గోవర్ధనగిరిని ఎత్తి కూడా తనని నమ్మిన వార్ని చిటికెన వేలితో కాపాడాడు!

 

4. జగద్డురువైనా... గురువులకి శిష్యుడే! గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు! కృష్ణం వందే జగద్గురుం అంటాం. అయినా ఆయన కుల గురువు సాందీపని ముని మొదలు ఎందరో మునులు, ఋషులకి పాదాభివందనాలు చేశాడు! వినమ్రంగా, వినయంగా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నాడు...

 

5. కృష్ణం ప్రణయ సఖి వందనం... కన్నయ్య అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయనలోని ప్రియుడేగా? అసలు కృష్ణుని వంటి ప్రియుడు లోకంలో ఇంతకు ముందు , ఇక ముందు వుంటాడా? వుండనే వుండడు! రాథా దేవిది ప్రేయసీ ప్రేమ! రుక్మిణీ వంటి అష్టభార్యలది అర్ధాంగి ప్రేమ! గోపెమ్మలది భక్తి ప్రేమ! కంసుని చెరలోని పదహారు వేల కన్యలది శరణార్థి ప్రమ! ప్రేమలెన్నైనా... ప్రియుడు వాసుదేవుడే!

 

6. ఫల్గుణ సఖుడికంటే గొప్ప స్నేహితుడెవరు? స్నేహానికి నిర్వచనం శ్రీకృష్ణ తత్వం! ఆ స్నేహితుడు అర్జునుడైతే తన కోసం సారథిగా మారతాడు! గీతని బోధిస్తాడు! అదే స్నేహితుడు సుధాముడైతే... పిడికెడు అటుకులు తీసుకుని... కుచేలుడ్ని కాస్తా కుబేరుడ్ని చేస్తాడు! ఏం చేసినా మైత్రి కోసమే... 

 

7. బలరామానుజుడి కంటే బహుగుణవంతుడెవరు? సర్వ లోకాలకి అగ్రజుడు తానే అయినా నందునింట శ్రీకృష్ణుడు బలరాముని తమ్ముడై పెరుగుతాడు! అన్నకి ఎంత గౌరవం ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఎక్కడా తక్కువ కానీయక మసులుకుంటాడు! తమ్ముడెలా వుండాలో సూచిస్తాడు... 

 

8. ఆర్తిగా పిలిస్తే అందరికంటే ముందుగా వచ్చే అన్నా! ద్రౌపతి అయిదుగురు భర్తలున్నా అవమాన భారం నిలువునా దహించి వేస్తున్నప్పుడు అన్నయ్య కన్నయ్యనే పిలిచింది! ఎప్పుడో ఒక్క గుడ్డ పీలిక ఆడపిల్ల సొమ్ము తీసుకున్నందుకు ఆమెకు ఎడతెగని చీరల్ని ఇచ్చి ఆదుకున్నాడు! అంతే కాదు, సుభద్ర కడుపున పాండవ వంశాంకురం అగ్నికి ఆహుతి కాబోతుంటే... ఈ అన్నయ్యే వచ్చి చెల్లెలి కడుపులోని కొడుకుని కాపాడాడు! చెల్లెళ్ల పట్ట బాద్యతలో ఎక్కడా చిల్లు రాకుండా చూసుకున్నాడు!