కాంగ్రెస్ గూటికి కొండబాల?

డిప్యూటీ సీఎం భట్టితో సంప్రదింపులు!

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  రెండు రోజుల క్రితం  కొండబాల కోటేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో  ఉన్నంత కాలం ఆయన తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా కొనసాగారు.  గతంలో మధిర ఎమ్మెల్యే గా కూడా కొండబాల పనిచేశారు. దీంతో ఆయనకు   అనుచరగణం కూడా ఉంది. భట్టితో భేటీ సందర్భంగా కొండబాల తనకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమని కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో భట్టి నుంచి ఆయనకు స్పష్టమైన హామీ ఏదీ రాలేదని తెలుస్తోంది.

కొండబాల అడిగిన దానికి భట్టి  హామీ ఇవ్వలేననీ,  ఎప్పటి నుంచో   పార్టీలో కొనసాగుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారని అంటున్నారు. అయితే.. ఆరు నెలల తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని చెప్పినట్లు సమాచారం. దీనికి  కొండబాల కూడా సుముఖత వ్యక్తం చేసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం కొండబాల తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన  అనుచరుల నుంచి పార్టీ మార్పునకు విముఖత వ్యక్తమౌతోందని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu