ఆ ముగ్గురితో ...చిక్కుల్లో పడుతోన్న ఓరుగల్లు టీఆర్‌ఎస్
posted on Jun 13, 2017 4:11PM
.jpg)
ఓరుగల్లు టీఆర్‌ఎస్‌లో ముగ్గురు కీలక నేతల మధ్య విభేదాలు... పార్టీపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. ఆ ముగ్గురు నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు... అధిష్టానం తలలు పట్టుకుంటోందట. చిరకాల ప్రత్యర్ధులుగా... ఒకప్పుడు వివిధ పార్టీల్లో బలమైన నాయకులుగా ముద్రపడ్డ ఆ లీడర్లు ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నా... ఇప్పటికీ ఉప్పు-నిప్పులానే ఒకరిపై మరొకరు భగభగమండిపోతున్నారని అంటున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అయితే, మరొకరు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు... ఇంకొకరు ఎమ్మెల్సీ కొండా మురళి... ఈ ముగ్గురిలో ఒకరితో మరొకరికి సత్సంబంధాల్లేవ్. పార్టీ పటిష్టం కోసం కలిసి పనిచేయాల్సి సమయంలోనూ... మనుషులు కలవరు... మనస్సులు అసలే కలవవు.
కడియం, ఎర్రబెల్లి... వీళ్లిద్దరూ టీడీపీ నుంచి కీలక నేతలుగా ఎదిగారు. కడియం మంత్రిగా పనిచేస్తే... అదే పార్టీలో ఎర్రబెల్లి ...ప్రభుత్వ విప్ గా వ్యవహారించారు. ఇద్దరి మధ్య అప్పటి నుంచే భేదాభిప్రాయాలు ఉండేవి. అప్పట్లో టీడీపీని రెండు వర్గాలు నడిపించారు. 2014 ఎన్నికలకు ముందు కడియం టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లి... ఆ తర్వాత ఎంపీగా గెలిచి... కొద్దిరోజులకు డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, టీడీఎల్పీ నేతగా పనిచేసిన ఎర్రబెల్లి సైతం ఇటీవలే గులాబీ గూటికి చేరారు.
అయితే ఉప్పు-నిప్పులా ఉండే ఈ ఇద్దరు నేతలూ ... ఇప్పుడు కూడా ఒకే పార్టీలో ఉన్నా ..ఒకరితో మరొకరికి పొసగదు. ఎర్రబెల్లి టీడీపీలో.. కడియం టీఆర్ఎస్ లో ఉండగా... జెడ్పీలో జరిగిన ఓ గొడవ వారి మధ్య విభేదాలను మరింత పెంచింది. ఆ వైరం ఇంకా అలానే కొనసాగుతోంది. ఇక ఎర్రబెల్లి-కొండా మురళీ మధ్య సుదీర్ఘకాలంగా వైరం ఉంది. రెండు వర్గాల మధ్య హత్యా రాజకీయాలు కూడా నడిచాయి. ఈ ఇద్దరి వర్గపోరుపై అసెంబ్లీ స్ధాయిలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే వేదిక పంచుకుంటున్నారు. కానీ ఎడముఖం... పెడముఖమే. ఇటు కడియం శ్రీహరి, కొండా మురళీకి మధ్య కూడా గ్యాప్ ఉంది. అందుకే సురేఖ నియోజకవర్గమైన వరంగల్ ఈస్ట్‌లో జరిగే ఏ కార్యక్రమంలోనూ కడియం పాల్గొనరట.
బలమైన నాయకులుగా ముద్రపడ్డ కడియం, ఎర్రబెల్లి, కొండా మురలి కలిసి పనిచేయడం కష్టంగా మారింది. పార్టీ బలోపేతానికి ఈ ముగ్గురు నేతలు సమన్వయం అనివార్యమైయినప్పటికీ ఎవరికి వారే యమునా తీరేఅన్నట్లుగా వ్యవహారించడం కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోంది. రానున్న రోజుల్లో ఈ ముగ్గురు నేతల మధ్య విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నది టీఆర్ఎస్ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది.