వరంగల్ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కొండా మురళి
posted on Dec 9, 2015 7:32AM
.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్ నుంచి తెరాస అభ్యర్ధిగా మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పేరు ఖరారు అయింది. గత ఏడాది వైకాపాని వీడి తెరాసలో చేరినప్పటి నుంచి కొండా దంపతులను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అందుకే పార్టీ వ్యవహారాలలో కూడా ఎక్కువ జోక్యం చేసుకోవడం లేదు. బహుశః అందుకే కొండా మురళికి అవకాశం కల్పించి ఉండవచ్చును. కొండా దంపతులకు వ్యక్తిగతంగా ఉన్న పలుకుబడికి తోడు, అధికార పార్టీకి చెంది ఉండటంతో కొండా మురళి చాలా తేలికగానే ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని భావించవచ్చును.
తెలంగాణాలో మొత్తం 12 స్థానాలలో తెరాస పోటీకి దిగుతోంది. తెరాస తరపున రంగారెడ్డిలో రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయబోతున్నారు. కనుక ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలలో అన్ని పార్టీలలో క్రాస్ ఓటింగ్ జరగడం తధ్యంగా కనిపిస్తోంది. తెరాస ఎన్నికలలో గెలిచేందుకు ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ, దౌర్జన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెరాస దౌర్జన్యాలని ఎదుర్కొనే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు.