రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం

కాంగ్రెస్ లో మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావే అన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సంచలన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు పూర్తి విరుద్ధమని సమాజిక మాధ్యమ వేదికగా స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జులై 18)న యంగ్ ఇండియా స్కూల్ కు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ మరో పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందనీ, తానే ముఖ్యమంత్రిననీ అన్నారు. ఈ వ్యాఖ్యలను వ్యాఖ్యలపై కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ స్థానం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదును చూసి సీఎంకు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది నిర్ణయించాల్సింది పార్టీ అధిష్ఠానం అన్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి తానే మరో పేదళ్లు సీఎం అన్న వ్యాఖ్యలు పార్టీ విధానానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.  కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందనీ, అంతే కానీ ఎవరికి వారుగా సొంతంగా తమను తాము సీఎం అని ప్రకటించుకోవడం సరికాదని పేర్కొన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహించరంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కాంగ్రెస్ లో అనైక్యత మరో సారి ప్రస్ఫుటమైంది.