మోదీ సర్కార్ పై ఖర్గే ఫైర్.. 11 ఏళ్లు 33 తప్పులు !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.అలాగే..  వరసగా మూడు పర్యాయాలు, అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఎ ప్రభుత్వం మొత్తంగా 11 ఏళ్ళు పూర్తి చేసుకుని , 12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ 11 సంవత్సరాల పాలన ఎలా ఉందంటే చెప్పడం కష్టమే. అంతా బాగుందని అనలేము, అసలేమీ బాగులేదని చెప్పలేము. అయితే..  వరసగా మూడవ సారి దేశ ప్రజలు మోదీని మెచ్చి ఓటేసి గెలిపించారు, సో ..మోదీ తొలి పదేళ్ళ పాలన ప్రజలకు నచ్చింది. అందుకే, ముచ్చటగా మూడవసారి మోదీకి పట్టం కట్టారు,అనుకోవచ్చును. ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ప్రామాణికం కాబట్టి, మోదీ తొలి పదేళ్ళ పాలనకు పాస్  మార్కుల కంటే, కొంచెం మెరుగైన మార్కులే ప్రజలు ఇచ్చారు. 

నిజానికి..  వరసగా మూడవ సారి అధికారంలోకి రావడం ఒక చారిత్రక విజయమే అయినా..  2014, 2019 ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే.. మోదీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. బీజేపీ, ఎన్డీయే స్కోర్ దిగి వచ్చింది. 2014లో 284 స్కోర్’తో.. 30 ఏళ్లలో ఎప్పుడూ లేని ఒంటరిగానే మెజారిటీ సాధించిన  బీజేపీ 2019లో మరో మెట్టు పైకి ఎక్కింది బీజేపే ఒంటరిగా 303 సీట్లు గెలిచి చరిత్రను సృష్టించింది. అయినా.. సంకీర్ణ ప్రభుత్వాలనే కొనసాగించింది  అనుకోండి అది వేరే విషయం. అలాంటి బీజేపీ స్కోర్  2024లో 240 కి పడిపోయింది. అంటే 63 సీట్లు కోల్పోయింది. అయినా..  ఎన్డీఎ మిత్ర పక్షాల అండతో ఏర్పాటైన  సంకీర్ణ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.

సహజంగానే..  అధికార బీజేపీ,ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నాయకులు, మోదీని  మెచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ 11 సంవత్సరాల పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగిందని అభివర్ణించారు. అలాగే..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు,ఎన్డీయే ముఖ్యమంత్రులు మోదీ 11 ఏళ్ల పాలనను ఆహా ..ఓహో అంటూ మెచ్చుకునన్నారు. అదేమంత విశేషం కాదు. మోదీ పాలన ఎన్డీయేకి  ముద్దు.  

అలాగే..  విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, మోదీ పాలన అస్సలు నచ్చలేదు. అది కూడా సహజమే. అందుకే కాంగ్రెస్ సర్వాధికారి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను సింపుల్ గా ఛీ  కొట్టారు. మోదీ ప్రభుత్వాన్ని కలల ప్రభుత్వంగా అభివర్ణించారు. వర్తమానాన్ని వదిలేసి..  2047 గురించి కలలు పంచి, దేశాన్ని మోసం చేస్తోందని విమర్శించారు. 

మరోవంక..  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మరో అడుగు ముందుకేసి  మోదీని మోసాల పుట్టగా అభివర్ణించారు. మోదీ 11 ఏళ్ల పాలనలో  దేశానికి జరిగిన మేలు శూన్యమని తేల్చేశారు. 11 ఏళ్లలో 33 తప్పిదాలు చేశారని  మోదీ తప్పుల చిట్టాను వినిపించారు.  గతంలో పార్లమెంటులో కూడా తాను ఇదే మాట చెప్పిన సంగతిని గుర్తు చేశారు.  ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం, యువకులను మోసం చేయడం, పేదలను కడగండ్లపాలు చేస్తున్న ఇలాంటి ప్రధానిని  తమ రాజకీయ జీవితంలోనే చూడలేదని, ఖర్గే పేర్కొన్నారు.

ఇక అక్కడి నుంచి  ఖర్గే  ఆయనే చెప్పినట్లుగా, పార్లమెంట్ లోపలా బయటా చాలా కాలంగా చెపుతూ వచ్చిన  సంగతులనే మరోమారు వల్లె వేశారు. డిప్యూటీ స్పీకర్ సహా  విపక్షాలకు మోదీ ఏ చిన్న పోస్ట్ ఇవ్వడం లేదు అని మొదలు పెట్టి  ఈడీ దాడుల వరకు.. మోదీ ప్రభుత్వం  మొత్తం 33 తప్పులు చేసిందని ఎత్తిచూపారు. 

అయితే..  మోదీ 11 ఏళ్ల పాలనను అధికార విపక్షాలు, ఎలా చూసినా, ఏమనుకున్నా  తాజాగా, నిర్వహించిన మూడ్ అఫ్ డి నేషన్ సర్వే లు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ  ఎన్డీయేదే అధికారమని చెపుతున్నాయి. అంతే కాదు  2024 కంటే, ఈసారి.. బీజేపీ సొంత సంఖ్యా బలంతో పాటుగా ఎన్డీయే సంఖ్యా బలం కూడా పెరుగుతుందని చెపుతున్నాయి.  ఇండియా టుడే 2025 ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో  బీజేపీ 281 సీట్లతో సింపుల్ మెజారిటీ మార్క్  (273) క్రాస్ చేస్తుందనీ, అలాగే..  ఎన్డీఎ 343 సీట్లు గెల్చుకుంటుందని దీంతో  కాంగ్రెస్,ఇండియా కూటమి బలం తగ్గుతుందని సంకేతాలు ఇస్తోంది.  కాంగ్రెస్ బలం  99 నుంచి  78కి, ఇండియా కూటమి నెంబర్ 232 నుంచి 184కు పడిపోతుందని సర్వే చెపుతోంది. అలాగే..  తాజగా ఆపరేషన్ సిందూర్ తర్వాత నిర్వహించిన మరో సర్వేకూడా బీజేపీ, ఎన్డీయే కే జై కొడుతున్నది.. సో  11 ఏళ్ల మోదీ పాలనకు  ఇప్పటి వరకు అయితే  ప్రజామోదం పుష్కలంగానే ఉన్నట్లుంది. సందేహం లేదు. అయితే.. ఎన్నికలకు ఇంకా నిండా నాలుగు సంవత్సరాల సమయం వుంది. ఈలోగా ఏమైనా జరవచ్చును.