ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం
posted on Aug 13, 2025 2:38PM

ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఓ షాపు యజమానిపై గంజాయి మత్తులో కొందరు పోకిరీలు దాడి చేశారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశారు. రోడ్డు పక్కన ఉన్న షాపులపైనా దాడి చేసి హల్‌చల్ చేశారు. అల్లరిమూక కిరాణం షాపు, టూ వీలర్లపై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో దుకాణదారులు అడ్డుకోబోగా వారిపై దాడికి దిగారు.
ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. గంజాయి మత్తులో పిల్లలు, మహిళల పైనా దాడికి యత్నించారు. గతంలోనూ ఇదే అల్లరి మూక దాడికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా పోలీసులు గంజాయి బ్యాచ్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.