కలిసిపోయిన బెజవాడ తమ్ముళ్లు! 

విజయవాడ టీడీపీలో వర్గపోరు ముగిసినట్టేనా? చంద్రబాబు ఎంట్రీతో అంతా సెట్ రైట్ అయ్యారా?.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో బెజవాడ తమ్ముళ్లంతా విభేదాలు వీడి కార్పొరేషన్ ఎన్నికల్లో పని చేయనున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ మేయర్ అభ్యర్తి కేశినేని శ్వేత నేరుగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లారు. బొండ ఉమ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. శ్వేతతో పాటు విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురామ్‌ కూడా ఉమ ఇంటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో సహకరించాలని ఆమె కోరారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాల మద్దతును శ్వేత కోరారు. శ్వేతనే నేరుగా ఈ ముగ్గురు నేతలను స్వయంగా కలవడంతో సమస్యకు పరిష్కారం దొరికిందనిటీడీపీ  నేతలు చెబుతున్నారు.

మొదటి నుంచి కేశినేని శ్వేత మేయర్ అభ్యర్థిత్వంపై బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు బయటపడ్డాయి.  

బెజవాడ టీడీపీ నేతల వ్యవహారంపై తొలుత  అధిష్టానం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ సమస్య పరిష్కారం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.తిరిగి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ సారి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు.  టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడి వివాదం చల్లార్చారు. అసంతృప్తి నేతలను చంద్రబాబు సముదాయించినట్టు తెలుస్తోంది.