లోకేశ్ ప్రచారంలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఒంగోలు పర్యటన ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని 47వ డివిజన్‌లో లోకేష్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలు ఇవ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలను లోకేష్‌ సముదాయించారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పోలీసులు పంపివేశారు. 

 21 నెలల్లో హవాలా మంత్రి ఒంగోలుకి ఏం చేశాడని నారా లోకేష్ ప్రశ్నించారు.  ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. మరో అవకాశం ఇస్తే మన కుటుంబాలను జగన్ రెడ్డి నాశనం చేస్తాడని మండిపడ్డారు. తెలుగుదేశం గెలిచిన మొదటి వందరోజుల్లో 110 అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పారు. బకాయిలు ఉన్న ఇంటి పన్ను రద్దు చేస్తామని చెప్పారు.పేదలకు పెరిగిన నీటి పన్ను మాఫీ చేస్తామన్నారు. తాడేపల్లిలో ఆ రెడ్డి గారు.. ఒంగోలు‌లో ఈ రెడ్డి గారు ఏం చేశారని నిలదీశారు.ఒక్క రోడ్డు వేసారా... ఒక నీళ్ల ట్యాంక్ కట్టారా... ఒక ఎల్ఈడీ బల్బ్ బిగించారా.. అని ప్రశ్నించారు. మంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలన్నారు. ఒంగోలు లో గత 21 నెలల్లో అభివృద్ధి పడకేసిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.