వర్షం ఎప్పుడొస్తుందో ఇట్టే చెప్పేస్తాడు...
posted on Jul 24, 2017 3:46PM
.jpg)
వాతావరణ శాఖ అధికారులు వర్షం పడుతుందంటే ఆరోజు ఖచ్చితంగా పడదు అని చాలా సినిమాల్లో ఈ డైలాగ్ వినే ఉంటాం. అయితే ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం వర్షం రాకను ఇట్టే కనిపెట్టేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు గత 30 ఏళ్లనుండి ఈయన చెప్పింది నిజమవ్వడం ఆశ్చర్యకరం. కేరళలోని వయనాడు ప్రాంతానికి చెందిన విమల్ కుమార్ 30 ఎకరాల కాఫీ తోట యజమాని. అయితే ఎప్పుడు వర్షంపాతం ఉండే వయనాడులో వర్షం జాడ తెలుసుకోవడానికి భారత వాతావరణ కేంద్ర సహాయం మీద ఆధారపడకుండా తానే స్వయంగా వర్షం జాడ కోసం ఓ పరికరం కనిపెట్టాడు విమల్. కేవలం ఒక పరీక్షనాళికతో తయారు చేసిన రెయిన్‌గేజ్‌ను ఉపయోగించి 34 ఏళ్లుగా వర్షం రాకను కచ్చితంగా కనిపెట్టేస్తున్నాడు విమల్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే తన రెయిన్‌గేజ్ రీడింగ్స్‌ను బుక్‌లో రాసుకుంటాడు. వాటి ఆధారంగా వర్షం తీవ్రతను, స్థాయిని గుర్తించి తోటి కాఫీ రైతులకు చెబుతుంటాడు. ఆయన చెప్పిన విషయం గత 34 ఏళ్లలో ఏ రోజు కూడా తప్పు కాలేదని అక్కడి రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే.. వాతావరణ శాఖ మానిటరింగ్ సెంటర్లు ఉన్నా, వాటి అంచనా కన్నా విమల్ అంచనాలే సరిగ్గా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం గమనార్హం.