కేరళ ఏనుగు ఘటనలో కొత్త కోణం

కేరళ రాష్ట్రంలో పేలుడు పదార్థాలు నింపిన పండు తిని గర్భంతో ఉన్న ఏనుగు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఏనుగు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. 

అడవి పందుల నుంచి పంటపొలాలలను కాపాడుకునేందుకు కొందరు స్థానికులు ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని పర్యావరణ శాఖ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని పర్యావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ఎవరిదీ ఉద్దేశపూర్వక తప్పు లేదని, అయినప్పటికీ, నిందితులను వదిలేది లేదని స్పష్టం చేసింది. ఏనుగు మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని పర్యావరణ శాఖ తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu