కేజ్రీవాల్.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
posted on Mar 16, 2015 5:22PM

ప్రకృతి వైద్యం కోసం 12 రోజుల పాటు బెంగుళూరు వెళ్లిన కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చాలా ఉత్సాహంగా చెప్పారు. దగ్గు పూర్తిగా తగ్గిందని, మధుమేహం అదుపులోకి వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా జిందాల్ ఇన్సిస్ట్యూట్ డాక్టర్లకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి గొప్ప సంస్థలను దేశవ్యాప్తంగా నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు. ఇస్కాన్ లోని అక్షయపాత్ర పథకం, మధ్యాహ్న భోజన పథకం తనను బాగా ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా అక్కడి వంటగది చాలా శుభ్రంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పథకాన్ని ఢిల్లీలో కూడా ప్రవేశపెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ 12 రోజుల్లో ప్రజా సమస్యలపై ఆలోచించడానికి సమయం లభించిందని, తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నారు. విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఆలోచించాలని కేజ్రీవాల్ తెలిపారు.