బీఆర్ఎస్ నుంచి కవితకు ఉద్వాసన?
posted on Aug 4, 2025 4:10PM

భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.
తాజాగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కవితకు ఉద్వాసన చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి జగదీశ్వరెడ్డిని ఉద్దేశించిన లిల్లీపుట్ వ్యాఖ్యలతో కవిత లక్ష్మణ రేఖను పూర్తిగా దాటేశారని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా కవిత కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా, జగదీశ్ రెడ్డిపై ప్రత్యక్షంగా చేసిన వ్యాఖ్యల తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగదీశ్ రెడ్డి, కేటీఆర్ లు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ భేటీలో కవితకు ఉద్వాసన చెప్పాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ బయటపెట్టినట్లు చెప్పారు.
కవిత ఇటీవల జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన లిల్లీపుట్ వ్యాఖ్యలు పార్టీలో పెను సంచలనానికి తెరలేపాయి. తెలంగాణ ఉద్యమంతో కానీ, బీఆర్ఎస్ తో కానీ జగదీశ్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని? కవిత ప్రశ్నించారు. ఆయన ఓ లిల్లీపుట్ నాయకుడంటూ దుయ్యబట్టారు. తానెవరో తెలియకుండానే ఇంత కాలం బీఆర్ఎస్ లో ఉన్నారా అంటూ నిలదీశారు. అలాగే మరో నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డిపై కూడా విమర్శల వర్షం కురిపించారు. వీళ్లంతా పార్టీలో చేరి పదవులు అనుభవించి ఇప్పుడు తనపై విమర్శలు చేసే స్థాయికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడితో ఆగని కవిత.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపైనా పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలోని అగ్ర స్థాయిలో ఉన్న నేతలు తన కార్యకలాపాలపై నిఘా పెట్టారని పరోక్షంగా కేటీఆర్, హరీష్ రావులపై ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్లు పలువురు కవితపై చర్య తీసుకోవాలని కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. కవిత తీరు వల్ల పార్టీకి తీవ్ర నష్టంవాటిల్లోతోందని వివరించారనీ, దీంతో ఆమెకు ఉద్వాసన పలకడమే మేలని కేసీఆర్ కూడా చెప్పారనీ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ త్వరలోనే ఆమెకు పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతారని అంటున్నారు.