ఈ మౌనం.. ఏ వ్యూహం

తెలంగాణలో ఎన్నికలు ఎప్పడు? ఎంతో కాలంగా షికారులు చేస్తున్న ఈ ఊహాగానాలకు తెరపడింది. ఇంకా కొందరిలో కొన్ని అనుమానాలున్నా, సందేహాలు చాలా వరకు తొలిగి పోయాయి. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు  జమిలి, మినీ జమిలి ప్రస్తావన లేకుండా ముగిసిపోవడంతో  తెలంగాణ సహా ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో అసెంబ్లీ గడువు ముగుస్తున ఐదు రాష్ట్రాల్లో షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న భరోసా ఏర్పడింది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఎందుకో కానీ తెలంగాణలో ఉహించినంతగా ఎన్నికల సందడి కనిపించడం లేదు.  

తెలంగాణ శాసన సభ గడవు, వచ్చే సంవత్సరం, (2024)  జనవరి 1తో ముగుస్తుంది. కనుక ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త శాసన సభ కొలువు తీరాల్సివుంది. అంటే  ఈ సంవత్సరం చివర్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  మరో వంక  ఇప్పటికే  ఎన్నికల సన్నాహకాలు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహక పనులు చకచకా చక్కబెడుతోంది.  ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం చేయడం, పోలింగ్ బూతుల గుర్తింపు, అధికారులు, సిబ్బంది శిక్షణ ఇత్యాది సన్నాహక క్రతువులన్నీ చాలా వరకు పూర్తయ్యాయి. 

పోలీసు బదో బస్తు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అటువంటి వాటిని గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నికల నగరా మోగించేందుకు ఈసీ సిద్ధమవుతోంది.  వచ్చే నెల (అక్టోబరు) మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ లెక్కన 2018 లో జరిగినట్లే( 2018 డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది) డిసెంబర్ మెదటి లేదా  రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి.

అంటే ఎన్నికలకు ఇంకా నిండా  వంద రోజులు అయినా లేవు  అయినా కారణాలేమిటన్నది ఇతమిద్థంగా తెలియదు కానీ రాష్ట్రంలో  ఇంతవరకు ఎన్నికల సందడి పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా తొందరపడి ఒక కోయినా అన్నట్లుగా  ముందుగానే నాలుగు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే  అనూహ్యంగా   స్తబ్ధత కనిపిస్తోంది.  అభ్యర్థిత్వాలు ఖరారు అయిన వారు ప్రచార సన్నాహాలు ఆరంభించలేదు. అసమ్మతి గళాలు ఆగడం లేదు. అన్నిటినీ మించి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీర్  అటు జాతీయ రాజకీయ పరిణామాలపై స్పందించడం లేదు. ఇటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపైనా అయన  మౌనం వీడటం లేదు. చివరకు, కొద్ది మంది మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ  టికెట్లు ఇవ్వడంతో అనేక నియోజక వర్గాల్లో అసమ్మతి భగ్గుమంటున్నది. భంగపడిన ఆశావహులు  ఆందోళనల బాట పట్టారు.  అయినా ముఖ్యమంత్రి  స్పందించడం లేదు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  అగ్ర నేత రాహుల్ గాంధీ.  బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించినా కేసీఆర్  మౌనమే నా భాష అన్నట్లుగా ఉన్నారు.  అందుకే ఇప్పడు  రాష్ట్రంలో కేసీఆర్  మౌనం వెనక వ్యూహం ఏమిటి? అన్నది చర్చనీయాంశగా మారింది. అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే, ఆ మౌనం వెనక ఏదో దాగుందని  లేదంటే కేసీఆర్ అంత సైలెంట్ గా ఉండరని అంటున్నారు.  అయితే ఆ వ్యూహం ఏమిటన్నది మాత్రం అంతుబట్టడం లేదని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu