కలహం దిశగా కేసీఆర్, జగన్ స్నేహం

ఒకే కుటుంబంలా వున్న‌వారు విడిపోయారు. అందుకు కార‌ణాలు,  ల‌క్ష్యాలు ఏమ‌యినా  అలా జ‌రిగిపోయింది.  అయినా స‌హాయ‌స‌హ‌కాలు అందిపుచ్చుకుంటూ క‌ల‌కాలం స్నేహ‌భావంతోనే వుండాల‌ని అనుకున్నారు. తొలినాళ్ల‌లో కాస్తంత ఆలాగే సాగింది. క్ర‌మేపీ ఆంధ్ర‌రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు కేసుల గుదిబండ చుట్టి కోర్టులు, కేంద్ర చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేయిస్తున్నారు. మ‌రో వంక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప టికే అభివృద్ధి ప‌థంలో వున్నాం గ‌నుక ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌న్న ధీమాతో వున్నారు.

కానీ కాలం గడిచే కొద్దీ తానొక‌టి త‌లిస్తే కేంద్రం ఒక‌టి త‌ల‌చింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాలు  అన్యాయంగా పాల‌న అందిస్తున్నాయ‌ని, త‌మ స‌హకారాన్ని చుల‌క‌న‌గా చూస్తున్నాయ‌న్న క‌క్ష‌తో రెండు రాష్ట్రాల్లోనూ రాజ్య‌ధికారం చేజిక్కించుకోవాల‌ని అన్నింటా అడ్డుప‌డుతూ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ వేడిలో అన్న ద‌మ్మ‌ల్లాంటి తెలుగు ప్ర‌జ‌లు, నాయ‌కుల మ‌ధ్య వైరం పెరిగింది. దీనికి తోడు తాజాగా కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వానికి  మ‌ద్ద‌తునివ్వాల్సిన  ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌, అంత అవ‌స‌ర‌మే లేద‌న్న ధీమాతో కేసీఆర్  చెరో  వేపు విడిపోయారు.  కేసులు, ఇ.డి. త‌ల‌నొప్పుల భ‌యంతో జ‌గ‌న్ మోదీ స‌ర్కారు ఎదుట సాగిల‌ప‌డ‌డం త‌ప్ప రాష్ట్రానికి  ఈ మూడేళ్ల‌లో  ప్ర‌త్యేకించి వొర‌గ‌బెట్టిందేమీ లేదు. రాను రాను ఈ  ర‌హ‌స్యం ఆంధ్రాలో సామాన్యుల‌కీ తెలిసి పోయింది. అన్నీ ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన వాగ్దానాలేవీ చేసి చూప‌లేని  స్థితికి దిగ‌జారాడ‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. కానీ అటువేపు ప్ర‌జ‌ల విశ్వాసం కాస్తంత స‌డ‌లినా కేంద్రం నుంచి పూచిక‌పుల్ల సాయం అంద‌లేద‌ని, పైగా ద‌బాయింపులు ఎక్కువ‌య్యాయ‌ని  రివ‌ర్స్ గేర్‌లో కేసీఆర్  త‌న మంత్రుల‌తో, ఎమ్మెల్యేల‌తో మోదీ స‌ర్కార్ మీద తిట్ల దండ‌కం దాదాపు రోజూ వినిపిస్తున్నారు.

కేంద్రం త‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌తో ప‌ర్య‌ట‌న‌లు చేయించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితుల మీద పాల‌నా లోపాల మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సిగ్గెగ్గులేల నాకు  అంటూ జ‌గ‌న్  బిజెపీ తిట్ల‌ను, విమ‌ర్శల‌ను దులిపేసుకుంటూ త‌న‌కు ప‌దవే ముఖ్యం..  తిట్లు ఓ లెక్కా అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ ప‌రిస్థితులు జారిపోతున్నాయ‌న్న సంగ‌తి ప్ర‌జ‌ల‌కు తెలుస్తోంది. జ‌గ‌న్ వ‌ల్ల జ‌రిగేదేమీ లేద‌ని స్ప‌ష్ట‌మయింది.  ఇటు తెలంగాణాలోనూ బిజెపి నాయ‌కులు కేసీఆర్ ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల విసుర్లు విసురుతున్నారేగాని అందుకు కేటీఆర్ దీట‌యిన స‌మాధానాలు ఇస్తూ భ‌యంతో వొణుకుతున్న‌వారి ద‌గ్గ‌ర కెళ్లి ఈ తాటాకు శ‌బ్దాలు చేయ మ‌ని బిజెపి వ‌ర్గీయులకే సూచ‌న‌లు చేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వేళయింది. జ‌గ‌న్‌  త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బిజెపి కూట‌మి నిల‌బెట్టిన అభ్య‌ర్ధి ద్రౌప‌ది మూర్మికే త‌మ మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించారు.

ఇది వీరికి త‌ప్పని స్థితి. కానీ  ఒక మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి చేయ‌డంలో త‌ప్పేమీ లేద‌న్న అభిప్రాయంలో వున్న‌ప్ప‌టికీ  కేసీఆర్ మాత్రం విప‌క్ష‌ కూట‌మి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హాకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టిం చారు. ఇలా రాష్ట్రపతి పదవికి త్వరలో జరగనున్న ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలమధ్య రాజకీయంగా చిచ్చు రేపేటట్లు కనిపిస్తోంది.  రెండు రాష్ట్రాల మధ్య రోడ్డున పడాల్సినంత సమస్యలు ఏమీ ఇప్పటి వరకు పెద్దగా ఎదురు కాలేదు. కానీ జులై18న  జ‌రిగే  ఎన్నిక జ‌గ‌న్‌, కేసీఆర్ ల మ‌ధ్య  ముఖ్య మంత్రుల స్థాయిలో విభేదాలు సృష్టిస్తాయేమో అన్న అనుమానాన్ని పరిశీల కులు వ్యక్తపరుస్తున్నారు.  ఎందుకంటే ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ప్రధాని బాటలో నడుస్తుంటే. తెలం గాణా ముఖ్యమంత్రి  దేశంలోని  ప్రతిపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ అగ్రనేత యశ్వంతిన్హా కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.  రాష్ట్రపతి పదవి కోసం పోటీపడుతూ బరిలో దిగిన య‌శ్వంత్  నేటి రాజకీయాలలో ఎవరితో పోల్చుకున్నా ఆయన కొండ గుట్టల మధ్య శిఖరసమానుడు. ఆయనను తెలంగాణ ముఖ్య మంత్రి  కేసీఆర్ సమర్ధిస్తున్నారు.  

తెలంగాణ నేతలు అప్పుడ ప్పుడూ, అక్కడక్కడా జగన్ పైనా, జగన్ ప్రభుత్వం పైనా నోళ్ళు పారేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల కేటీఆర్ కూడా ఆంధ్రాలోని రోడ్ల దుస్థితిని గురించి ఘాటు గానే విమర్శించారు. ఆ తరువాత తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ సదస్సులో జగన్ - కేటీఆర్ లిద్దరూ కౌగిలించుకుని మరీ ఫోటోలు దిగి తమ  సఖ్యతను ప్రదర్శించుకు న్నారు. ఇప్పుడు  మళ్ళీ తాజాగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి  ఒక  సభలో మాట్లాడుతూ ‘ఆంధ్రలో జగన్మోహన్రెడ్డి ఉన్నడు.. వాడు అడుక్కుతింటాన్డు. మనల్ని అన్నరు తెలంగాణ వస్తే మీరు అడుక్కుతింటరు అని... ఇప్పుడు ఆంధ్రోళ్ళు బిచ్చమె త్తుకుంటున్నరు, రోజు నడవాలంటే కేంద్రం నుండి లోన్ రావాల వాళ్లకు, లేదంటే నడవదారాష్ట్రం'... అంటూ ఘాటైనమాటలతో బహిరంగంగా తూల నాడడం, కేసీర్ మైండ్ సెట్‌ని తెలియ‌జేస్తున్నద‌ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. కేసీఆర్ - కేటీఆర్లకు ముందస్తు సమాచారం లేకుండా తెరాస రాజకీయాలలో ఓ అనామకుడు  ఆంధ్రా ముఖ్యమంత్రిని 'వాడు... వీడు....' అని సంబోధించే స్థాయికి వెళ్ళగలడా అన్నది కూడా పరిశీలకుల అనుమానం. ఈ అనుమానంలో ఏమాత్రం నిజం ఉన్నా రెండు రాష్ట్రాల నేతలు, ప్రజల మధ్య పెద్ద  అపార్ధాలకు, అన ర్ధాలకు దారితీసే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 30 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో సంఖ్యాపరంగా ఆంధ్రా ప్రజలు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య వారధులుగా ఉన్న వారి మనోభావాలు గాయపడకుండా చూసుకోవలసిన బాధ్యత తెలం గాణ నేతలు, ప్రభుత్వంపై  ఉందనడంలో సందేహం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని  తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.  మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న తెలుగువాళ్ళు కాపురాలు వేరైనా కలహాలులేకుండా ఉండాలన్నది అందరి ఆశ, ఆకాంక్ష.