బిల్లులు చెల్లించని జగన్ సర్కార్.. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!?

జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.  ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. ఇందుకోసం కొత్త కార్డులను సైతం పంపిణీ చేశారు. ఇందులోనూ జగన్ పొటోల పిచ్చిని మరోసారి చాటుకున్నారు.   ఈ కొత్త కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించి మరీ పంచారు.   ఈ కార్డుల పంపిణీ ఈ ఏడాది జనవరి వరకూ సాగింది.  జగన్ మోహన్ రెడ్డిని పేదల పాలిట పెన్నిధిగా, అప్బాధబాంధవుడిగా వైసీపీ నేతలు భజనగీతాలు ఆలపించేశారు కూడా.   అయితే,  రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంది? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రులలో ఈ వైద్య సేవ అమలు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు? వైద్య పరీక్షలు, వైద్యం, అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీలో భాగంగానే అందిస్తారా? మారిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాలు ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపత్రులకు అందించారా? అనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అలాగే అసలు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నారా? ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్య శ్రీ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఈ పథకాన్ని ఎంత మంది ప్రజలు వినియోగించుకున్నారు? జగన్ హయంలో ఇప్పటి వరకూ చెల్లించిన ఆరోగ్య శ్రీ నిధులెన్ని?  ఇప్పుడు ఎన్ని బకాయిలున్నాయన్నది కూడా జగన్ సర్కార్ రహస్యంగానే ఉంచింది.

వాస్తవానికి   జగన్ ప్రభుత్వ హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోటాను కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు హయం వరకూ కాస్త ఆలస్యంగానైనా ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పలుమార్పు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రావాల్సిన బకాయిల సంగతెలా ఉన్నా.. ఇకపై తమకు ఆరోగ్యశ్రీనే వద్దంటూ కొన్ని ఆసుపత్రులను ఈ సేవ నుండి బయటకొచ్చేశాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ ఆసుపత్రికి కావాలంటూ దరఖాస్తుల వెల్లువ రాగా.. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులే బయటకి వచ్చేశాయి.

 ఇక మరికొన్ని ఆసుపత్రులలో అయితే కేవలం వైద్యం మాత్రమే ఆరోగ్య శ్రీలో అందిస్తుండగా.. మిగతా వైద్య పరీక్షలు, మందులు వంటి వాటి కోసం  రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులలో అయితే ఆసుపత్రులలో అన్ని పరీక్షలు చేసే సదుపాయం ఉన్నా.. బకాయిలు రాక ఆరోగ్యశ్రీ పేషేంట్లను బయట ల్యాబులకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. కేవలం డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రి రూమ్ అద్దెలు వంటివి మాత్రమే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారు. వాటికి ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే అవసరం లేకపోవడంతో.. ప్రభుత్వం నుండి బకాయిలు ఎప్పుడొచ్చినా తమకి నష్టం ఉండదన్న ఆలోచనతో ఇలా ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ఆసుపత్రులైతే ప్రభుత్వం మారకపోతుందా.. కొత్త ప్రభుత్వంలో అయినా బిల్లులు రాకపోతాయా అని కొనసాగుతున్నారు.    

ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. బకాయిలు కొండల్లా పేరుకుపోవడంతో  ఆంధ్రప్రదేశ్ లోని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ రాసింది.   గత ఆరు నెలలుగా ప్రభుత్వం   ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలను ఇక అందించలేమన్నదే ఆ లేఖ సారాశం. ప్రభుత్వం గత ఆరునెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయనీ, ఇంకెంత మాత్రం ఆరోగ్య శ్రీ పథకం కింద తమ ఆస్పత్రులలో వైద్య సేవలు అందించలేమనీ ఆ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొంది. తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించనట్లైతే శనివారం (మే4) నుంచి తమ ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేసింది.   

తనను తాను అత్యంత సమర్ధవంతమైన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ఆత్మస్థుతిలో మునిగి తేలే జగన్ హయాంలో పేదల ఆరోగ్యం ఎంత నిర్లక్ష్యానికి గురైందనడానికి గత ఆరు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులను నిలిపివేయడమే నిదర్శనం. ఇక ఇప్పుడు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను ఇక కొనసాగించలేమంటూ చేతులెత్తేశాయి.