కేదార్ నాథ్ ఆలయ మ్యూజియం నిర్మాణ నిపుణునిగా శివనాగిరెడ్డి

కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది. మ్యూజియంలోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేయబోయే ప్రదర్శితాలను ఎంపిక చేసేందుకు బుధవారం (మే1)  ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని తగు సూచనలు చేశారు.

 కేదార్ నాథ్ ఆలయం వెనుక నిర్మిస్తున్న శివ ఉద్యానవనంలో ప్రదర్శించే  శివరూప శిల్పాలపై జరిగిన చర్చలో పాల్గొని, వివిధ రాజవంశాలకు చెందిన చారిత్రక శివుని శిల్పాలను ఎంపిక చేయటంలో స్థపతిగా తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ సభ్యులు డా.చూడామణి నందగోపాల్, డా. మాన్వి శెఠ్, డా. ప్రీతి త్రివేది, మేఘ్ కళ్యాణ సుందరం, నిఖిల్ వర్మ, స్తపతి ఉమాపతి ఆచార్య, సహాయకులు కాజల్, దుర్గేష్ లు పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.

 కేదార్ పరిచయ మ్యూజియంలోని మూడు గ్యాలరీలో మొదటి గ్యాలరీలో తీర్థ స్థలంగా కేదార్నాథ్, రెండో గ్యాలరీలో శివుని కుటుంబం, శివారాధన, మూడో గ్యాలరీలో స్థానిక సాంప్రదాయాలు, సాంస్కృతిక అంశాలు, ఆలయ వెనక నిర్మించిన ప్రాకారంలో లోపలి వైపున శివుని వెయ్యి పేర్లు, శివుని ఆయుధాలు ప్రదర్శించబడతాయని ఆయన చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu