మళ్ళీ వస్తా.. మాట్లాడు కుందాం.. నల్లారి రీ ఎంట్రీ సంకేతం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విభజన అనంతరం రాజకీయంగా తెరమరుగై పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ పెట్టారు.2014 అసెంబ్లీ ఎన్నికలలో, చెప్పు గుర్తు, సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదంతో, రాజ్యాంగ బద్దంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, సమైక్యాంధ్ర నినాదం ఇచ్చి ఏమి ప్రయోజనమని ప్రజలు, ఆయన గుర్తుతోనే ఆయనకు   సమాధాన మిచ్చారు. రాజీనామా చేయవలసిన సమయంలో ముఖ్యమంత్రి పదవి పట్టుకు వేళ్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు  రాష్ట్ర విభజన  జరిగిపోయిన తర్వాత  బయటకు రావడాన్ని  జనం జీర్ణించుకోలేక పోయారు. అందుకే  ఆయన్ని పట్టిచుకోలేదు. ఆ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ఘోరంగా ఓడి పోయారు.ఇక అక్కడ నుంచి  ఆయన రాజకీయాలకు దూరంగా దాదాసే అజ్ఞాతవాసంలోకి వెళ్లి పోయారు. 

ఈ ఎనిమిదేళ్ళ కాలంలో  అప్పుడో సారి .. ఇప్పుడో సారి ఒకరి రెండు సందర్భాలలో ఆయన పేరు రాజకీయ చర్చల్లో వినిపించినా, ఆయన మాత్రం ఎక్కడా క్రియాశీలంగా కనిపించలేదు. అయిన బీజేపీలో చేరుతున్నారని లేదు ఇంకేదో పార్టీలో చేరుతున్నారని రాజకీయ చర్చలో వినిపించినా, అలాంటిదేమీ జరగలేదు. అందుకే ఆయన రాజకీయ జీవితానికి తెర పడినట్లేనని విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. మధ్యలో 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు, అయినా ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్ని పిలిపించి పీసీసీ బాధ్యతలు చేపట్టమని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని వ్యక్తిగత పనుల మీదనే ఢిల్లీ వచ్చిన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.

దీంతో, ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారనీ, సోనియా గాంధీ ఆయనకు కీలక బాధ్యతలు ఆఫర్ చేశారనే చర్చ మొదలైంది.  అదలా ఉంటే తాజాగా, ఆయన సొంత జిల్లా అన్నమయ్య ( చిత్తూరు) జిల్లాకు రావడంతో మళ్ళీ మరోమారు, నల్లారి వార్తల్లో కనిపించారు. నిజానికి ఆయన తమ స్వగ్రామం నగరిపల్లెలో కొన్న  భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళారే కానీ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేందుకు వెళ్ళలేదు. భూమి కొనుగోలువ్యవహారం కాబట్టే, ఆయన వెంట కుమారుడు, నిఖిలేశ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

అయితే, ఈసందర్భంగా ఆయనకు ఏపీసీసీ కార్యదర్శి అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్ నేత శ్రీవర్ధన్, పలువురు నేతలు, కార్యకర్తలు అభిమానులు  స్వాగతం పలికారు. అయన వారిని పలరించారు. ఇవన్నీ సహజంగా, ఏ నాయకుడు, (మాజీ అయినా) జరిగే తంతే, అందులోనూ  మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. నల్లారి విషయంలోనూ అదే జరిగింది. అయితే,  ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో, ‘త్వరలోనే మళ్లీ వస్తా.. అందరినీ కలుస్తా.. ఇకపై అందుబాటులోనే ఉంటా.. అప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుందాం..’అంటూ ఆయన పలికిన వీడ్కోలు పలుకులు, రాజకీయ వర్గాల్లో ఉహాగానాలకు తెర తీశాయి.

ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తుందని, అందుకే ఆయన మళ్ళీ వస్తా .. మాట్లాడుకుందాం  అన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే  నిజంగా, అయన రీ ఎంట్రీ ఇస్తారా ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తారా? బతికించ గలరా? అంటే, ఆయన రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఎలా ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించడం మాత్రం, ఇప్పట్లో అయ్యేపని కాదని, అ మాట  కొస్తే, కాంగ్రెస్సే కాదు బీజేపే సహా ఏ జాతీయ పార్టీకి ఇప్పట్లో ఎపీలోకి ఎంట్రీ చిక్కదని పరిశీలకులు భావిస్తున్నారు.