ఎమ్మెల్సీ ఎగ్గొట్టి నామినేటెడ్ పోస్టులు.. కేసీఆర్ ప‌ద‌వుల పందేరంపై విమ‌ర్శ‌లు..

కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ అంద‌రికీ తెలిసిందే. నోటికొచ్చిన‌న్ని హామీలు ఇచ్చేస్తారు. ఆ త‌ర్వాత నాలుక క‌రుచుకుంటారు. అంద‌రినీ పార్టీలో క‌లిపేసుకుంటారు. ఉన్న‌వారు పార్టీని వీడి వెళ్లిపోకుండా ఊరిస్తుంటారు. కారును ఓవ‌ర్‌లోడ్ చేసేస్తుంటారు. ఇక ప‌ద‌వులు ఇవ్వాల్సిన స‌మ‌యంలో చేతులెత్తేస్తారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అలానే జ‌రిగింది. ఎప్ప‌టి నుంచో ఎమ్మెల్సీ ప‌ద‌వితో ఊరించిన చాలామందికి ఎప్ప‌టిలానే హ్యాండిచ్చేశారు. కొత్త‌గా కారెక్కిన కౌశిక్‌రెడ్డి, ఎల్‌.ర‌మ‌ణ‌, వెంక‌ట్రామిరెడ్డి లాంటి వారిని పెద్ద‌ల స‌భ‌కు పంపించారు. కొత్త వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెడితే.. మ‌రి పాత వారి సంగ‌తేంటి? ఎప్ప‌టి నుంచో కారు డిక్కీలో ప‌డుండి.. డ‌క్కామొక్కీలు తింటున్న త‌మ ప‌రిస్థితి ఏంటంటూ.. తిర‌గ‌బ‌డుతున్నారు. 

మ‌రోవైపు, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేదు. వ‌రుస ఓట‌ములు ఓవైపు.. ప్ర‌జా వ్య‌తిరేక‌త మ‌రోవైపు. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌, బండి-ఈట‌ల కాంబినేష‌న్‌లో బీజేపీ.. కారుకు పంక్చ‌ర్లు పెట్ట‌డానికి రెడీగా ఉన్నాయి. ఉ అంటే ఊ అన‌డానికి సిద్ధంగా ఉన్నారు. ప‌ద‌వి ఇస్తే ఓకే.. లేదంటే.. త‌మ దారి తాము చూసుకునేందుకు చాలా మంది టీఆర్ఎస్ నేత‌లు ప‌క్క‌చూపులు చూస్తున్నారు. ఈ సంఖ్య భారీగా ఉండ‌టంతో కేసీఆర్‌లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు. అందుకే, హ‌డావుడిగా ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేశారు. అంద‌రికీ కాకున్నా.. కొంద‌రికి అడ్జ‌స్ట్ చేశారు. అయితే, తాజా ప‌ద‌వుల‌పైనా ఎవ‌రికీ సంతృప్తి లేద‌ని అంటున్నారు. ఇంత‌కీ కేసీఆర్‌ ఎవ‌రెవ‌రికీ ఏయే నామినేటెడ్ పోస్టులు క‌ట్ట‌బెట్టారంటే....

తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఎంపిక చేశారు. పాపం.. ఆకుల ల‌లిత‌. ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూశారు. కూతురు క‌విత కోసం ల‌లిత‌ను బ‌లిప‌శువు చేశారు కేసీఆర్‌. ఆ త‌ప్పిదాన్ని స‌రి చేసేందుకు ఇప్పుడు ఇలా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎక్క‌డ‌.. ఈ ప‌ద‌వి ఎక్క‌డా? అందుకే ఆకుల ల‌లిత తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది.

ఇక‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గజ్జెల నగేశ్‌, స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఛైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ జూలూరి గౌరీశంకర్‌, షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను కేసీఆర్‌ నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.  

ఇటీవలే మూడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌గా, టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా విభాగం నేత మన్నె క్రిశాంక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) ఛైర్మన్‌గా నియ‌మించారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితాలో ప్ర‌ముఖంగా పేరు వినిపించిన‌.. ధూంధాం కళాకారుడు, గాయకుడు వేద సాయిచంద్ (సాయిచందర్‌)ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా మరికొన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. అయినా, అసంతృత్తి జ్వాల ఇంకా ర‌గులుతూనే ఉంది.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu