కేసీఆర్ సలహాదారులు ఇలా చేశారేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేసీఆర్ అన్నీ నేనే.. అంతా నేనే అన్నట్లుగా వ్యవహరించారు. ఏ విషయంలోనైనా సరే తనంతటి వాడు లేడన్న భావనే వ్యక్త పరిచారు. అందుకు ఆయన పార్టీ బీఆర్ఎస్ నేతలు వంత పాడేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తీసుకున్నా, మరే విషయం తీసుకున్నా కేసీఆర్ తీరు, ధోరణీ ఇలాగే ఉండేది. ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్ల కంటే తానకే ఎక్కువ తెలుసునని కసీఆర్ భావించే వారు. సామాజిక ఇంజనీర్ ను తానేననే వారు.  అలా చెప్పుకున్న ఆయన తన హయాంలో 12 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించుకున్నారు.

అధికారంలో ఉండగా అలా సలహాదారులుగా ఎవరినైనా నియమించుకునే అధికారం, వెసులుబాటు ఆయనకు ఉంది. దానిని ఎవరూ కాదనలేదు. కానీ అలా నియమితులైన సలహాదారులు ప్రభుత్వం మారగానే హుందాగా రాజీనామా చేసి తప్పుకోవడం విధాయకం. ఆనవాయితీ. పైగా కేసీఆర్ నియమించిన లేదా నియమించుకున్న సలహాదారులు అలాంటి ఇలాంటి వారు కాదు. వారు కేసీఆర్ కు మామూలు ఫ్యాన్స్ కాదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్. సోమేష్ కుమార్ విషయమే తీసుకుంటే.. ఆయన ఏపీ క్యాడర్ కు చెందిన వ్యక్తి అయినా చివరి వరకూ తాను కేసీఆర్ వద్దే పని చేస్తానని కోర్టుల వరకూ కూడా వెళ్లారు. చివరికి ఏపీకి రాక తప్పలేదు అది వేరే విషయం.

కోర్టు తీర్పు మేరకు ఏపీలో రిపోర్ట్ చేసినా అక్కడ ఆయన పని చేసింది లేదు. సరే అది పక్కన పెడితే.. ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలిగాకా సోమేష్ కుమార్ ను సీఎం సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన ఒక్కరే కాదు తనకు నమ్మకమైన, తనకు సహకరించిన పెద్దలను ప్రభుత్వ సలహాదారులుగా  కేసీఆర్ నియమించుకున్నారు. ఇక్కడ ప్రశ్న ఆయన సలహాదారులుగా నియమించుకున్న వారు ఆ హోదాలో, ఆ పదవిలో చేసినదేమిటన్నదే. వాళ్లు ఏం చేశారన్నది ఒకటైతే.. ఒక ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు, ఆ ప్రభుత్వం మారగానే ఆ పదవి నుంచి వారంతట వారు వైదొలగడం ఒక సంప్రదాయంగా వస్తున్నది. కానీ కేసీఆర్ నియమించుకున్న సలహాదారుల రూటే సెపరేటు. వారిని కొత్త ప్రభుత్వం తొలగించే వరకూ ఆ పదవులనే పట్టుకు వేళాడారు. కేసీఆర్ నియమించుకున్న ప్రభుత్వ సలహాదారులలో ఏడుగురిని ఆ పదవుల నుంచ తొలగిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఏడుగురూ ఎవరంటే..   వారు రాజీవ్‌ శర్మ (ప్రభుత్వ ముఖ్య సలహాదారు). అనురాగ్‌ శర్మ (శాంతిభద్రతలు, నేర నిరోధక సలహాదారు), ఎకే ఖాన్‌ (మైనారిటీ సంక్షేమం), జీఆర్‌ రెడ్డి (ఆర్థిక సలహాదారు), ఆర్‌. శోభ (అటవీ సలహాదారు), సోమేష్‌ కుమార్‌   (ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు).  మిగిలిన వారి సంగతి పక్కన పెడితే..  వీరంతా దాదాపుగా ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసుకున్న వెంటనే ప్రభుత్వ సలహాదారులుగా నియమింతులైన వారే. వారి సేవలను వినియోగించుకోవడం కంటే అధికారులుగా ఉండగా సహకరించినందుకు కేసీఆర్ వారికి రిటర్న్ గిఫ్ట్ గా సలహాదారు పోస్టులు కట్టబెట్టారనే భావించాల్సి ఉంటుంది. అటువంటి వారు ప్రభుత్వం మారిన తరువాత కూడా కొత్త ప్రభుత్వం తొలగించే వరకూ ఆ పదవులను అంటిపెట్టుకు కూర్చోవడమే కొసమెరుపు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu