బడ్జెట్ సమావేశాలకూ కెసీఆర్ డుమ్మా
posted on Feb 10, 2024 11:42AM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కెసీఆర్ మాత్ర ఈ సమావేశాలకు వచ్చి సలహాలు , సూచనలు ఇస్తారని అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మళ్లీ కెసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని బిఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాలకు హాాజరుకాలేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. ఇటీవల అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.అదే రోజు తెలంగాణ భవన్ కు వెళ్లి బిఆర్ఎస్ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు. దీంతో, ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు.
అయితే, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి కానీ, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ రాలేదు. ఈరోజు బడ్జెట్ సందర్భంగానైనా ఆయన వస్తారని భావించినప్పటికీ... ఆయన రావడం లేదనే సమాచారం అందింది. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాట్లపై కీలక నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం బంజారాహిల్స్, నంది నగర్ లోని తన నివాసంలోనే ఉన్నారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల రెండో రోజు కూడా మాజీ సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరగ్గా.. బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలిరోజు అమావాస్య కావడంతో హాజరుకాలేదని భావించగా.. మర్నాడు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే బడ్జెట్ సందర్భంగా శనివారం కేసీఆర్ సభకు వచ్చే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి. కానీ బడ్జెట్ సమావేశాలకు సైతం మాజీ ముఖ్యమంత్రి , ప్రధాన ప్రతిపక్ష నేత ఎగ్గొట్టడం చర్చనీయాంశమైంది. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చాననే చెప్పుకునే కెసీఆర్ కీలకమైన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడం శోచనీయమని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.