2026లో కాజీపేట నుంచి కోచ్‌ల ఉత్పత్తి : రైల్వే మంత్రి

 

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ప్రధాని మోదీ దానిని నేరవేర్చారని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మెగా కోచ్ ఫ్యాక్టరీ పనులను ఆయన పరిశీలించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు.

 కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు.పనులు వేగంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కాజీపేట నుంచి త్వరలో 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయారవుతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని గుర్తు చేశారు.

రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారని అన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ద్వారా 40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారం అవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా 3 వేల మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.   వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఎంత త్వరగా అప్పగిస్తే అంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాతమని కిషన్ రెడ్డి తెలిపారు