కేసీఆర్ భోళా శంకరుడు.. కవిత కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు
posted on Jul 4, 2025 10:09AM
.webp)
ఈ శతాబ్దానికే ఇది జోక్ కావచ్చు. ఈ భూమ్యాకాశాల మధ్య కేసీఆర్ కి తెలియని రాజనీతి లేదు. రెడ్డి, కమ్మగా విడిపోయి కొట్టుకు ఛస్తున్న ఉమ్మడి ఆంధ్ర రాజకీయాల్లో వెలమల పాత్రను తిరిగి తీసుకురావడంలో అపర చాణక్యుడన్న పేరు సాధించారాయన. అంతేనా కేసీఆర్ అన్నీ తెలిసే కావాలనే చేశారని అంటారు. అలాగని కులాభిమానం అయినా ఉందా? అంటే అదీ లేదని చెబుతారు. అంతటి స్వార్ధపరుడు కేసీఆర్ అన్న పేరు ఈనాటిది కాదని అంటారు. సాటి వెలమకు మంత్రిత్వం ఇచ్చారని కూడా చూడకుండా.. ఏకంగా టీడీపీ బయటకొచ్చి... అప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయం లాంటి తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి నిద్రలేపి.. దాన్ని అంచలంచెలుగా.. ముహుర్తాలు చూసుకుని మరీ.. ఉద్యమాలు చేయడంలో భోళాతనం ఎక్కడో ఎవరికీ అర్ధం కాదని అంటారు.
ముహుర్తాలంటే గుర్తుకొచ్చింది.. తాను డిప్యూటీ స్పీకర్ పదవి చేయలేనని అలిగి ఇంట్లో కూర్చున్నపుడు ఒక గోదారి జిల్లాలకు చెందిన బ్రాహ్మడు కేసీఆర్ దగ్గరకు వచ్చారనీ.. ఆయన వచ్చే పుష్కరకాలం తర్వాత మీకు అఖండ రాజయోగం పట్టనుందని.. స్పీకరేం కర్మ.. ఏకంగా సీఎం అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయనీ.. పెద్ద పెద్ద రాజనీతిజ్ఞులే మీ ముందు బలాదూర్ అయిపోతారనీ.. చెప్పారనీ.. ఆ వెంటనే ఈయన తెలంగాణ వాదాన్ని వెలికి తీసి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారి చేత తెలంగాణ పాఠాలు వల్లె వేయించుకున్నట్టు ఒక సమాచారం.
ఆపై కావాలనే ఉన్న పదవులకు రాజీనామా చేయడం, అనవసరంగా ఉప ఎన్నికలొచ్చేలా చేయడం.. అటు పిమ్మట అమాయక పిల్లల ప్రాణాలు పోయేలా రెచ్చగొట్టడం. అందుకు అందమైన బలిదానం అంటూ పేర్లు పెట్టడం వంటివి కూడా భోళా శంకరుడి లీలలేనా?. అక్కా అన్నది కొందరి ప్రశ్న.
ఎట్టకేలకు తెలంగాణ వచ్చీరావడంతో దళితులను ముఖ్యమంత్రి చేస్తానని అన్న మాటను కాస్తా తీసి హుస్సేన్ సాగర్ గట్టు మీద పెట్టి.. ఉద్యమకారుడు ఉద్యోగి అయ్యాడని చెప్పుకోవడంలోనూ భోళాతనముందా? కవితక్కా..! కాళేశ్వరం కథల నుంచి మొదలు పెడితే.. ప్రతి దాన్లో రాజకీయం. ఆఖర్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇక్కడ పదేళ్ల పాటు ఎక్కడ రాజధాని హోదా ఇవ్వాల్సి వస్తుందోనని ఆయన్ను కాస్తా ఓటుకు నోటు కేసులో తన టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇరికించి మరీ తరమగొట్టడంలోనూ భోళాతనమేనా అక్కా.. అని నిలదీస్తున్నారు కొందరు.
కేసీఆర్ కథలు.. చెబితే చారెడు.. వింటే మూరెడు అన్నట్టు... లెక్కలేనన్ని లీలలు. పేపరు లీకేజీల దగ్గర్నించి.. పేపరోళ్లను పాతాళంలో పాతి పెడతా! అనే వరకూ ఎన్నో.. ఎన్నెన్నో.. అదేమంటే మాపై ఇంత నెగిటివ్ గా రాస్తున్న వారికి ఉచితాలు, వరాలివ్వాలా? అంటూ నేరుగానే అనడమొకటి. ఇదంతా కూడా భోళాతనమేనా అక్కా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్ర- తెలంగాణ తేడా లేకుండా ఆయన కోసం రాసినోళ్లు, కథనాలు వండి వార్చినోళ్లు, అందులో భాగంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నోళ్లూ.. వీరంతా కలసి మట్టి కొట్టుకు పోగా.. ఎక్కడో మీకోసం యాగాలు చేసిన స్వామీజీలకు రూపాయ లెక్కన స్థలాలూ పొలాలూ ఇవ్వడంలోనూ భోళా మనిషినే చూసుకోవాలా అక్కా మేము.. మా ఖర్మ కాకుంటే అంటూ కొందరు ఆనాటి పాత జ్ఞాపకాలను తిరగదోడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ స్పందన ఎలాంటిదని విలేఖరులు అడిగిన ప్రశ్నకు.. కవితక్క చెప్పిన సమాధానం.. కేసీఆర్ ఒక భోళా శంకరుడు, ఆయన కింది వారు ఇలాంటి పనులు చేసి ఉంటారేమో అంటూ ఆమె చెప్పిన ఈ కొటేషన్ పై ఒక్కొక్కరు.. పై విధంగా కామెంట్లు చేస్తున్నారు.