కవితక్క లుక్కు మారింది కానీ!
posted on Oct 26, 2025 12:25PM

కవితక్క కారు కహానీలు.. ఇప్పట్లో ఆగేలా లేవు. మొత్తం తన లుక్కు మార్చిన కవితక్క.. ప్రస్తుతం ప్రతిఘటనలో విజయశాంతిలా కనిపిస్తున్నారన్న మాటేగానీ.. ఆమె తన పుట్టింటి మీద పుట్టింటిలాంటి బీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరగటం మాత్రం తగ్గించడం లేదు. సొంత పార్టీ వారే తనను నిజామాబాద్ లో ఓడించారని అంటున్నారు కవిత.
ప్రస్తుతం జాగృతి జనం బాట పట్టిన ఆమె 33 జిల్లాల తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నాననీ.. ఆనాడు ప్రాణాలు బలి ఇచ్చి తెలంగాణ రావడానికి కారణమైన అమర వీరుల కుటుంబాలకు కోటి రూపాయలు దక్కే వరకూ తన పోరాటం ఆపనని అన్నారు. తనను కలవడానికి వచ్చే వారు ఈ యాత్రలో వచ్చి కలవవచ్చని.. ఆహ్వానం పలికారు కవిత.
తనకు ఇప్పటి వరకూ రావల్సిన గుర్తింపు అయితే రాలేదనీ.. పార్టీలో తనను తొక్కేశారన్నట్టుగా మాట్లాడిన కవిత.. టార్గెట్ ఎవరు??? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బేసిగ్గా ఆమె బీఆర్ఎస్ బై ప్రాడక్ట్. అలాంటి ఆమెకు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ప్రత్యర్ధులుగా ఉండాలి. కానీ చిత్రమేంటంటే ఆమె నోరు తెరిస్తే యాంటీ బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తున్నారు. దానికి తోడు తన తండ్రిని ఇన్నాళ్ల పాటు వెనకేసుకొచ్చిన ఆమె తాజాగా తన తండ్రి ఫోటో లేకుండానే ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ మొత్తం పోరాటం రాజకీయమైనదా? లేక వ్యక్తిగతమైనదా? అన్న అనుమానాలకు తావిస్తున్నారు కవిత. ఎందుకంటే ఒక స్పష్టమైన రాజకీయ విధానంతో జనం కోసం- జనం బాట పట్టానని క్లారిటీ ఇవ్వకుండా పొద్దస్తమానం పుట్టింటిని తన ఇంటి వారిని పదే పదే తిట్టడం వల్ల అది ఆమె సొంత విషయం అవుతుంది కానీ ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటంగా కనిపించదు కదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.