వీళ్లు విద్యార్థులా..? రాజకీయ విరోధులా..?

కర్నాటకలో హిజబ్ కలకలం ప్రకంపనలు సృష్టిస్తోంది. కాలేజీల్లో ఆధునిక విద్యనభ్యసించి ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన విద్యార్థులు హిజబ్ కోసం పట్టుపడుతూ రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఉడిపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ కాలేజీలో ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరిస్తూ కాలేజీకి అటెండవుతున్నారు. దీనిపై కాలేజీ యాజమాన్యం వ్యతిరేకించింది.  ఏ డ్రెస్ కోడ్ పెట్టామో అదే డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని ఆంక్షలు విధించింది. ముస్లిం అమ్మాయిలంతా ఈ విషయాన్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని కాలేజీ యాజమాన్యాన్ని ఒప్పించాలనుకొని ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారు. ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి వస్తుండడంతో అటు హిందూ యువకులు కాషాయ కండువా ధరించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. దీంతో ఈ విషయం కాస్తా రెండు మతాలకు సంబంధించిన ఇష్యూగా కలరెక్కింది. కొద్ది రోజులుగా కాలేజీ కాంపౌండ్ ముందు అమ్మాయిలంతా నిరసన తెలుపుతున్నారు. అటు హిందూ అబ్బాయిలకు తోడు అమ్మాయిలు సైతం జతయ్యారు. జై శ్రీరాం అంటూ ఇవతలివారు, వీ వాంట్ జస్టిస్ అంటూ అవతలివారు నినాదాలు చేస్తున్నారు. ఆ ఇద్దరినీ కాలేజీ యాజమాన్యం గేటు బయటే ఆపింది. మరోవైపు హిజబ్ ధరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని, దాన్ని గౌరవించాలని హిజబ్ కు మద్దతుగా పలు పార్టీలతో పాటు జైభీమ్ విద్యార్థులు కూడా బ్లూ కండువాలు ధరించి వారికి తోడయ్యారు. అంతేకాదు.. ఈ  ఇష్యూను అన్ని కాలేజీల్లో కూడా లేవనెత్తుతామని, హిజబ్ కోరుకునేవాళ్లు ఎంతమంది ఉన్నారో పాలకులకు తెలిసేలా చేస్తామంటున్నారు ముస్లిం విద్యార్థులు. ఇదిలా ఉంటే...

తాజాగా నిరసన తెలుపుతున్న ఆ గుంపునుంచి ఇద్దరు అనుమానాస్పదమైన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే మొత్తం ఐదుగురు అనుమానితులను గుర్తించామని, ముగ్గురు పారిపోగా ఇద్దరు మాత్రం దొరికారని పోలీసులు అంటున్నారు. అరెస్టయినవారిని హాజీ అబ్దుల్ మజీద్, రజాబ్ గా గుర్తించారు. వారి వద్ద నుంచి ప్రమాదకరమైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కత్తితో పాటు వారి దగ్గర మామూలు మారణాయుధాలకు భిన్నంగా లిథాల్ ఆయుధాలు దొరకడం ఆందోళనకరంగా మారింది. లిథాల్ వాయు రూపంలో గానీ, ద్రవరూపంలో గానీ ఉండే ఓ రసాయనం. తినే పదార్థాల్లో లేదా తాగే పదార్థాల్లో గనక లిథాల్ ను కలిపినట్టయితే అవి తీసుకున్నవారికి స్లో పాయిజన్ గా శరీరంలోకి ఎక్కి  కొద్ది రోజుల్లోనే చనిపోతారు. అలాంటివాటిని కలిగి  ఉండి అక్కడెందుకు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు ఉడిపి అడిషనల్ ఎస్పీ సిద్ధలింగప్ప ఆ ఇద్దరూ స్థానికులు కాదని చెబుతున్నారు. 

ఇస్లామిక్ తీవ్రవాదం ఇండియాలో జడలు విప్పుతోందని, కాలేజీల్లో చదువుకునే పిల్లల్లో కూడా ఇస్లామిక్ ఎక్స్ ట్రీమిజాన్ని నూరిపోస్తున్నారని, దాని ప్రభావం చేతనే అమ్మాయిలు కూడా ఇలా అసాధారణంగా తయారవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలంతా బుర్ఖా తీసేయాలని ఉద్యమాలు చేస్తుంటే.. ఇండియాలో మహిళలు హిజబ్ కోసం ఆందోళనలు చేయడం, దానికి పలు సంస్థలు, సంఘాలు, పార్టీలు సైతం మద్దతివ్వడం నిజంగా ఆందోళన కలిగించే పరిణామమని వారంటున్నారు. కర్నాటకలో క్రమంగా ఇస్లామిక్ టెర్రరిజం వ్యాప్తి చెందుతుందన్న  ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో ఇలాంటివాటిని మొగ్గలోనే తుంచాలంటున్నారు. మరి సర్కారు ఏం చేస్తుందో చూడాలి. మరోవైపు ఈ వివాదం కోర్టుకు చేరింది. మరి కోర్టు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.