చంద్రబాబు కరీంనగర్ పోరు బాటలో అలజడి
posted on Dec 28, 2011 1:33PM
హైదరాబా
ద్: కరీంనగర్ జిల్లాలో రైతు పోరుబాట చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ముల్కనూరు రాగానే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఓ పది మంది వరకు చంద్రబాబు కాన్వాయ్ వరకు చేరుకుని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.
చంద్రబాబును అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెరాస కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తెలంగాణ జెఎసి కార్యకర్తలు కూడా చంద్రబాబును అడ్డుకోవాడనికి ప్రయత్నించారు. ఈ సమయంలో నలుగురు గాయపడ్డారు. చంద్రబాబు యాత్రకు ఆటంకం కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తెరాస నాయకులు నారదాసు లక్ష్మణరావు, కెప్టెన్ లక్ష్మీకాంత రావు వంటివారిని గృహనిర్బంధం చేశారు. కొన్ని ముందస్తు అరెస్టులు కూడా చేశారు. అంతకు ముందు రెండు గ్రామాల్లో తిరిగిన చంద్రబాబుకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాలేదు. ముల్కనూరు రాగానే ఒక్కసారిగా తెలంగాణవాదులు ముందుకు వచ్చి చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు.