అన్నంత పనిచేసిన కపిల్ మిశ్రా...
posted on May 14, 2017 3:53PM

ఆప్ బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా అన్నంత పని చేశారు. కేజ్రీవాల్ కు సంబంధించి కొన్ని విషయాలు బయటపెడతానని...తాను చెప్పే రహస్యాలతో ఢిల్లీ వణుకుద్దని చెప్పిన ఆయన ఈరోజు అన్నంత పని చేశారు. గత నాలుగు రోజుల నుండి నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..అరవింద్ కేజ్రీవాల్ డొల్ల కంపెనీలు పెట్టి నల్లధనాన్ని వైట్‌గా మార్చారని...ఎన్నికల సంఘానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని తెలిపారు. మొహల్లా క్లినిక్ కుంభకోణంలోనూ ఆప్ నేతల పాత్ర ఉందని... ఆప్ నేతల విదేశీ పర్యటనల ఖర్చపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. షెల్ కంపెనీ నుంచి ఆప్ రూ. 2 కోట్ల విరాళం తీసుకుందని వెల్లడించారు. ఇవన్నీ కొంతమందికి తెలిసినా ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు లిఖిత పూర్వక సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాదు కేజ్రీవాల్ కు అక్రమంగా వందలాది కంపెనీలు ఉన్నాయని, ఈ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కంపెనీలకు సంబంధించిన అధికారిక పత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు.