అమాత్యుల ఆగ్రహం కడపకు శాపం
posted on Mar 27, 2012 10:33AM
కడపజిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీరి ఆగ్రహం కడపజిల్లా అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి శాపంగా మారింది. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి వారంరోజుల క్రితం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిపై విమర్శలు చేసి రాజీనామా లేఖ పంపారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పెద్దల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన నాయకులను, కేడర్ ను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు. జిల్లానుంచి మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు నాయకుల్లో ఇద్దరు అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతుండటంతో జిల్లాలో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. త్వరలో కడపజిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ఇలా వ్యవహరించడం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని కార్యకర్తలు భయపడుతున్నారు.
కార్యకర్తల్లో ఇప్పటికే చాలా మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ ఇద్దరు మంత్రుల నిర్వాకంతో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే యోచనలో ఉన్నారు. మంత్రి సి.రామచంద్రయ్య పదవిని అధిష్టించి కొద్దిరోజులే అయినప్పటికీ ఆయన పార్టీపై ఇంతలా విరుచుకుపడటానికి కారణం ఏమిటన్న దానిపై కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడ పోటీ చేసే అవకాశం తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికీ ఇవ్వాలని రామచంద్రయ్య పట్టుబడుతున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంగీకరించడం లేదు. దీంతో రామచంద్రయ్య తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.