గుంటూరు కాంగ్రెస్ రూటే సపరేటు
posted on Mar 27, 2012 10:22AM
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. మిగతా జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ శాఖల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తుండగా గుంటూరు జిల్లాలో మాత్రం నాయకుల మధ్య విభేదాలు ప్రతిరోజూ పతాక శీర్షికలను చేరుతున్నాయి. ఈ జిల్లాలోని ప్రత్తిపాడు, మాచర్ల స్థానాలను ఇప్పటివరకు పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరో రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనుంది. కాంగ్రెస్ లో మాత్రం ఇటువంటి ప్రయత్నాలేమీ కనిపించడంలేదు. జిల్లాకు చెందిన మంత్రులు ప్రజా ప్రతినిధులు కూడా తమ సొంత వ్యవహారాలతో బిజీగా ఉంటున్నారు తప్ప అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయడం లేదు. దీనికితోడు నాయకుల మధ్య ఉన్న విభేదాలు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారాయి.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చిచ్చురేపిందో అందరికీ తెలిసిందే. ఓటమికి కారణం మీదంటే మీదంటూ కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకున్నారు. గుంటూరుజిల్లాలో కూడా అందుకు భిన్నమైన పరిస్థితులు ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడులో ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్ ఛార్జిని నియమించలేదు. దీనికి కారణం నేతల మధ్య ఉన్న విభేదాలే. ప్రట్టిపాడుపై పట్టుకోసం కన్నా, రాయపాటి వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వీరు కలిసి పనిచేయడం అసాధ్యం. కూచిపూడి విజయ, ఆమె భర్త సాంబశివరావు మంత్రి కన్నాకు సన్నిహితులు. విజయకు టిక్కెట్ ఇప్పించడానికి కన్నా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆమెకు టిక్కెట్ వస్తే గెలిపించాల్సిన బాధ్యతా కన్నాపై ఉంటుంది. ఇదే జరిగితే రాయపాటి వర్గం సహాయ నిరాకరణ పాటించడం ఖాయం. మిగతా రెండుపార్టీలు అభ్యర్థులను ముందే ఎంపిక చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత జాప్యం చేస్తే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉంది.