చిరంజీవి హీరో కాదు జీరో
posted on Mar 27, 2012 10:48AM
మాజీ పార్లమెంటేరియన్ చేగొండి హరిరామజోగయ్య ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఘాటుగా విమర్శలు చేస్తుంటారు. ఒకప్పుడు చిరంజీవితో సన్నిహితంగా మెలిగిన చేగొండి ఇప్పుడు ఆయన పేరు చెబితేనే చిటపటలాడుతున్నారు. చిరంజీవి రాజకీయాల్లో కూడా పెద్ద హీరో అవుతాడని భావించామని అయితే ఆయన అతిపెద్ద జీరోగా మారాడని చేగొండి అంటున్నారు. 2014 ఎన్నికల్లో చిరంజీవిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో గెలుపు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని, అయితే ఆ పార్టీకి భంగపాటు తప్పదని చేగొండి జోస్యం చెబుతున్నారు.
చిరంజీవి డబ్బుకోసం ఎటువంటి పనైనా చేయగలరని, దానికి ఉదాహరణ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమేనని చెప్పరు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను చిరంజీవికి అప్పగిస్తే దానిని ఆయన తెలివిగా తన సంపాదనకు ఉపయోగించుకుంటాడని చేగొండి అంటున్నారు. తిరుపతిలోనూ, నర్సాపురం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే సత్తా చిరంజీవికి లేదని చేగొండి కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం పూర్తయిన తరువాత చిరంజీవి తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపినా ఆశ్చర్యపోనక్కరలేదని చేగొండి అంటున్నారు.