సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కర్ణన్ నోటీసులు... నా కోర్టులో హాజరుకండి..

 

కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ కు సుప్రీం కోర్టు కు మధ్య ఉన్న వివాదం రోజురోజుకు పెరుగుతుందే తప్పా.. తగ్గేలా లేదు. ఇప్పటికే కోర్టు ధిక్కార నేరం కేసులో జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మార్చి 31న సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు జస్టిస్ కర్ణన్ ఏకంగా చీఫ్‌జస్టిస్, ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నోటీసులు జారీ చేశారు. అక్కడితో ఆగకుండా...ఈ నెల 28వ తేదీన తన ఇంటిలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ కోర్టులో హాజరుకావాలంటూ ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీన తాను సుప్రీంకోర్టుకు హాజరైనప్పుడు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తనను అవమానించిందని ఆరోపించారు. దళితుడనైనందుకే తనను ఉద్దేశపూర్వకంగా వేధించిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారంటూ సుమోటో జ్యుడీషియల్ ఆర్డర్‌ను జారీచేశారు. కాగా ఇలా ఒక హైకోర్టు జడ్జీ కోర్టుధిక్కారం కింద సుప్రీంకోర్టు ఎదుట హాజరుకావడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలోఇదే మొదటిసారి కాగా.. చీఫ్‌జస్టిస్‌తోపాటు ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తనముందు హాజరుకావాలని హైకోర్టు జడ్జీ నోటీసులు ఇవ్వడం కూడా భారత న్యాయవ్యవస్థలో ప్రథమం. మరి దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu