అయోమయంలో బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై మల్లగుల్లాలు

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపికచేయడంలో  బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఏర్పడిన ఖాళీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఉప ఎన్నిక కోసం అప్పుడే కాంగ్రెస్ ప్రచారం ఆరంభించేసింది.  మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ లు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు మొదలెట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాకపోయినప్పటికీ, అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థి విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు.  

గతంలో  ఈ నియోజకవర్గంలో ని ఒక వర్గం ఓటర్లతో పరిచయాలు ఉన్న మంత్రి తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో మంత్రి పొన్నంతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావే శాలు నిర్వహిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం నోటిఫికేషన్ వచ్చాక, అభ్యర్థుల ఎంపిక తరువాత అన్నట్లుగా సైలెంట్ గా ఉన్నాయి.  అయితే సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం బీఆర్ఎస్ లో అయోమయం నెలకొంది.  దివంగత ఎమ్మెల్యే మాగంటి కుటుంబంలో ఒకరిని బరిలో దింపాలని చూస్తున్నారు.

దీనికి కొంత వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. పి. జనార్దన్ రెడ్డి తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులలో అన్నీ హంగులు ఉన్న వ్యక్తిని ఎంపికచేయాలనే ఆలోచనా చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక బీజేపీ పార్టీలో స్థానికంగా ఉన్న వారిలో ఒకరిని ఎంపికచేసే ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తే వారిని గెలిపించుకుని సత్తా చాటాలన్న  పట్టుదలతో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu